టిఆర్‌ఎస్‌పై షర్మిల ధ్వజం
బంధనాల విముక్తికే పార్టీ ఏర్పాటు
15 నుంచి నిరాహార దీక్ష
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో
ప్రజా పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని వైఎస్ షర్మిల తెలిపారు. తెలంగాణ ప్రజల ఆ కాంక్షలు నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేయడం లేదని ఆమె ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం పెవిలియన్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ఆమెకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీబులో షర్మిల సభావేదిక వద్దకు చేరుకున్నారు. దారి పొడువునా ప్రజలు బారులు తీరి ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంఎల్‌సి కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన పెవిలియన్ మైదానంలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ కెసిఆర్ దొర కాళ్ల చెప్పుల కింద పడి నలిగిపోతుందని ఆమె తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కెసిఆర్ ఇంటికే తరలిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి భవన్ గేటు దాటి సామాన్యుల దరి చేరడం లేదన్నారు. అవసరం కోసం అందరినీ వాడుకుని పరిపాలనలోకి రాగానే దొరతనం చూపుతున్నారని ఆమె ఆరోపించారు. అవసరానికి అప్పుడు ఉపయోగపడిన వారిని పక్కకు నెట్టివేశారని ఆమె తెలిపారు. 18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన రోజున సంకల్ప సభను జరుపుకుంటున్నామని, అండగా నిలిచి సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పునః ప్రతిష్టించబోతున్నామని, రాజన్న రాజ్యాన్ని తీసుకు వచ్చి సంక్షేమం, అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు చూపిస్తామన్నారు. ‘తెలంగాణలో రైతులు సంతోషంగా లేరు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులు రైతులే కాదంటున్నారు. మహళలకు జీరో వడ్డీలకే రుణాలు అన్నారు. 12.50 శాతం వడ్డీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం సంగతి దేవుడెరుగు ఆవైపు చూసే పరిస్థితి లేదు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరనందునే ప్రజల కోసమే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాం అని’ ఆమె ప్రకటించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని ఆ బంధాలను విముక్తి చేయడానికే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దొర వద్ద సాగినపడిన వారికే పదవులు లభిస్తున్నాయని, మరో మారు తెలంగాణ ప్రజల రాతను మార్చేందుకు రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కెసిఆర్‌కు అమ్ముడుపోయిందని, ఇక పార్టీకి మనుగడ లేదన్నారు. బిజెపి చెప్పుకునేందుకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదని ఆమె తెలిపారు.15 నుంచి నిరాహార దీక్ష : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేయనున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు తమ పార్టీ కార్యకర్తలు జిల్లాల్లో నిరాహార దీక్షలు చేస్తారని ఆమె తెలిపారు. తెలంగాణలోని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కొంత కాలం ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని ప్రతి ఇంటికి ఉద్యోగం దక్కుతుందని ఆమె తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల ఇక మీ బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఆశీర్వదించి అండగా నిలవండి అంటూ తెలంగాణ సమాజానికి వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. మా బలం, బలహీనత ప్రజలేనని విలువలతో కూడిన విశ్వసనీయతతో కూడిన రాజకీయాల కోసం నిలబడే కుటుంబం మాది అని అందుకే నా బిడ్డ తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంకల్పించిందని చివరి వరకు ప్రజలకు అండగా నిలబడతామని ఆమె తెలిపింది. ఖమ్మంలో శుక్రవారం జరిగిన సంకల్ప సభలో విజయమ్మ మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం తెలంగాణలో రాజకీయ పార్టీ అవసరమైందని షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీతోనే తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని విజయమ్మ తెలిపారు. తెలంగాణ సమాజంతో రాజశేఖర్‌రెడ్డిది వీడదీయరాని బంధమని తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్‌ఆర్ దివెనలతోనే షర్మిల ముందుకు వస్తుందన్నారు. షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నా అన్నప్పుడు నేను సంతోషించానన్నారు. మానవతా వాది వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. ఐదు సంవత్సరాల మూడునెలల పాలనలో ఒక్క రోజు కూడా పన్నులు పెంచలేదని విజయమ్మ తెలిపారు. షర్మిల తెలంగాణ పాదయాత్రలు నిర్వహించిందని భగవంతుడే ఆశీర్వదించినట్లుగా అప్పుడు ఇక్కడ పాదయాత్ర సాగిందని ఆ క్రమంలోనే వైఎస్ పాదయాత్ర సాగించిన ఏప్రిల్ తొమ్మిదిన సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడీ, మన్‌మోహన్‌లు సైతం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మరచిపోలేదని తెలంగాణ ప్రజలు మరువబోరని ఆమె తెలిపారు. షర్మిలది కఠోరమైన పోరాటమే అయిన తెలంగాణ కోసం ఆమె ఎంచుకున్న మార్గం అభినందనీయమైనదని మీరందరూ ఆశీర్వదించాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు సభలో మాట్లాడారు. ఇందిరాశోభన్, ఖమ్మం జెడ్పి మాజీ ఛైర్మన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.
‘దొర’ కాళ్లకింద తెలంగాణ ఆత్మగౌరవం
RELATED ARTICLES