సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
ప్రజాపక్షం/జనగామ బ్యూరో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపం వద్ద సిపిఐ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జిడి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చాడ పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దొడ్డి కొమురయ్య వీరమరణం పొందారన్నారు. విస్నూరు దొర అరాచకాలతో ప్రజలు విసుగు చెందడంతో ఆ వెట్టిచాకిరి, దోపిడీకి చరమ గీతం పాడారని, వాళ్ళ అరాచకాలకు గురైన వారు అంతాఒక్కటై నినాదాలు చేస్తుండగా.. ఆ నినాదాల్లో మారుమోగిన గొంతే దొడ్డి కొమురయ్యదని చెప్పారు. ఆయనతో పాటు ఎందరో వీరులు తోడై పోరాటానికి పిడికిలి బిగించారని, విసునూరు గడీలపై పోరాటం చేశారని తెలిపారు. ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. టి. వెంకట్రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఎ సిహెచ్.రాజారెడ్డి ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష్యులు తమ్మెర విశ్వేశ్వర రావు, సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి, వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఆది సాయన్న, బి.అజయ్,పల్లె నర్సింహ, లక్ష్మినారాయణ, కె. ఉప్పలయ్య, జిల్లా రైతు సఘం నాయకులు బిళ్ళ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య ఆశయాలు నెరవేర్చాలి
RELATED ARTICLES