ప్రజలను మోసం చేయడమే లక్ష్యం
రూ.26 లక్షలు నగదు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
బాబా అక్రమాలను వెల్లడించిన డిఐజి రంగనాథ్
ప్రజాపక్షం/ నల్లగొండ ప్రతినిధి నల్లగొండ జిల్లా పిఎపల్లి మండలం అజ్మాపురం గ్రామంలోని శ్రీసాయి సర్వస్వం సాయి మాన్సీ ఛారిటబుల్ ట్రస్టు పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పి అమాయక భక్తులకు మాయ మాటలు చెప్పి పూజలు, హోమాల పేరుతో డబ్బులు దండుకుంటున్న దొంగ బాబా విశ్వ చైతన్య స్వామిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగబాబా చేసిన అక్రమాలను డిఐజి ఎ.వి.రంగనాధ్ వెల్లడించారు. దొంగబాబా ఆర్థికంగా ఉన్న మహిళా భక్తులను సాయిబాబా ప్రవచనాల పేరుతో ఆకర్షించి లోబర్చుకునేవాడని, ఇప్పటి వరకు కొంతమంది మహిళలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని డిఐజి తెలిపారు. బాబానే తనను స్వయంగా కలలోకి వచ్చి మీ వద్ద నుండి డొనేషన్లు, నగదు, బంగారం రూపంలో తీసుకోమని, దానికి అంతకంటే ఎక్కువ రెట్లు లాభం చేకూరుతుందని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుండి మోసపూరితంగా డొనేషన్లు వసూల్ చేశాడని చెప్పారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారాలు, ఆర్థిక లాభాల కోసం పూజల పేరితో నకిలీ వన మూలికలు, చూర్ణం, తైలం, నకిలి యంత్రాలంటివి తయారు చేసి తన మాటలతో ఎక్కువ మొత్తంలో నగదు వసూల్ చేసేవాడని వివరించారు. అమాయక ప్రజలను మోసం చేయడమే కాకుండా మాయ మాటలు చెప్పి డబ్బులు గుంజడం, అక్రమాలకు పాల్పడుతున్న దొంగబాబాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి తెలిపారు. బాబా పూజలు నమ్మి ఓ మహిళ నిత్యం ఆశ్రమానికి వెళ్లేదని, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ఆన్‌లైన్ల ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నట్లు తెలుసుకుని బాబాకు దగ్గరైందని, స్వామి ఇటీవల మహిళను వేధింపులకు గురి చేయడంతో ఆమె ఫిర్యాదు చేశారని డిఐజి రంగనాధ్ తెలిపారు. దీంతో నల్లగొండ టాస్క్‌పోర్ట్ టీమ్ రంగంలోకి దిగి గత నాలుగు రోజుల క్రితం స్వామి ఆశ్రమాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఆశ్రమంలో ఉన్న కంప్యూటర్ డేటాను, దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి మోసం చేసి సంపాధించిన రూ.26 లక్షల నగదు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 కోట్ల 3 ఫిక్స్‌డ్ డిఫాజిట్ బాండ్స్, 17 ఎకరాల భూమి, 7 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు, ఒక కారు, వివిధ రకాల వనమూలికలు, యంత్రాలు, పూజ సామాగ్రి, రక్షణ కవచాలు స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి తెలిపారు. దొంగ బాబా విశ్వ చైతన్య స్వామితో పాటు ఆయన అనుచరులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా , కొయ్యలగూడెం మండలం, నారాయణపురంకు చెందిన గాజుల గౌతమ్, ఖమ్మం పట్టణానికి చెందిన వంగూరి సృజన్ కుమార్, ఆమనగల్ మండలం, ఆకుతోటపల్లికి చెందిన ఓర్సు విజయ్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన నల్లగొండ డిఎస్‌పి వెంకటేశ్వర్‌రెడ్డి, టాస్క్‌పోర్స్ సిఐలు మహాబూబ్ భాష, వన్ టౌన్ సిఐ బాల గోపాల్, ఇతర సిబ్బందిని డిఐజి అభినందించారు.
దొంగ బాబా నేర చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వ చైతన్య డిగ్రీ కళాశాలలో ఎంపిజె పూర్తి చేసి 2002లో హైదరాబాద్ శివం రోడ్డు నల్లకుంటలో ప్రిమీయం కంప్యూటర్ సెంటర్ పెట్టి ప్రజల నుండి సుమారు 1 కోటి రూపాయల డబ్బులు వసూల్ చేసి ఇవ్వకుండా పారిపోయాడు. దీనిపై బాధితులు నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టారు. తరువాత సాయి బాబా భక్తుడిగా మారి పౌరోహితం , సాయి చరిత్రపై ప్రవచనాలు, పలు ఛానెళ్లలో ప్రవచనాలు చెప్తూ 2017 సంవత్సరంలో సొంతంగా య్యూటూబ్ ఛానెల్ శ్రీ సాయి సర్వస్వం పేరుతో ఏర్పాటు చేసుకుని అందులో ప్రవచనాలు వీడియోలను అప్‌లోడ్ చేసేవాడు. కొన్ని రోజుల తరువాత ఆన్‌లైన్ , ప్రత్యక్షంగా కలవాలి అనుకున్న వారికి 500 నుండి 1100 రూపాయల వరకు తీసుకునేవాడు. ఇలా సాయి బాబా భక్తునిగా వ్యాపారం మొదలు పెట్టి మోసాలకు పాల్పడుతూ చివరికి పిఏపల్లిలో గల తన సొంత ఆశ్రమంలో మహిళలను వేధింపులకు గురి చేసి అరెస్టు అయ్యారు.
దొంగ బాబా అరెస్టు
RELATED ARTICLES