రూ.22 లక్షల విలువైన 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరోద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 22 లక్ష ల విలువైన 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా ఎస్‌పి ఆర్. భాస్కరన్ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో గత కొంత కాలంగా ద్విచక్ర వాహనాలు ఎక్కువగా చోరీ అవుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నాలుగు నెలల నుంచి గట్టి నిఘా పెట్టారు. సిసి టివి కెమెరాల ఫుటేజ్ అధ్యయన బృందంతో పాటు కాల్ డేటా అనాలసిస్ క్షేత్రస్థాయి బృందాలు మూడుగా ఏర్పడి అనేక కోణాల్లో వివరాలను సేకరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉదయం 9గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా తల్లంపాడ్ గ్రామానికి చెందిన చల్లా ప్రభాకర్, అదే జిల్లాలోని కూసుమంచి మండల పెరిక సింగారం గ్రామానికి చెందిన బండారి స్వామిలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రభాకర్ తాను ఆర్థికంగా చితికిపోవడంతో కూసుమంచిలో గత ఆరు నెలల క్రితం ఓ పాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు విచారణలో తెలిపాడు. అయినా ఇబ్బందుల నుండి బయట పడకపోవడంతో ఈజీమనీ కోసం మెకానిక్, డ్రైవర్ల ప్రోద్బలంతో ఖమ్మంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనానికి చెందిన ప్రత్యేక తాళాన్ని ఖరీదు చేసి దాని ద్వారా మార్చిలో ఒక బైక్‌ను దొంగిలించినట్లు తెలిపాడు. ఆ బైక్‌ను తన పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వచ్చే బండారు స్వామికి అమ్మినన్నాడు. అనాటి నుండి తాను సూర్యాపేటలో 13, కోదాడలో 4, జగ్గయ్యపేటలో 6, నందిగామలో 4, ఖమ్మంలో 5, హన్మకొండ, కూకట్‌పల్లిలో ఒక్కొక్కటి బైక్‌ను దొంగిలించినట్లు చెప్పాడు. వీటిలో పోలీసులు 40 వాహనాలు స్వాధీనం చేసుకోగా మరో 5 వాహనాల సమాచారం తెలియాల్సి ఉంది. దొంగిలించిన వాహనాలను నిందితుడు విక్రయించాడని పోలీసులు చెప్పారు. ప్రభాకర్ ఇచ్చిన సమాచారంతో అతడితో పాటు చోరీకి పాల్పడిన ఖమ్మం కూసుమంచి గ్రామానికి చెందిన బొమ్మగాని ఉపేందర్, అదే మండలంలోని ముత్యాలమ్మగూడెంకు చెందిన ఊడుగు సీతారాములు, మల్లెబోయిన సతీష్, అదే మండల పరిధిలోని చేగోమ్మ గ్రామానికి చెందిన గుగ్గిల వెంకటేష్, లోక్యాతండాకు చెందిన జరుకుల చిరంజీవి, మల్లెపల్లి గ్రామానికి చెందిన పస్తాల నవీన్‌లను అరెస్టు చేశారు.
దొంగలముఠా అరెస్టు
RELATED ARTICLES