చారిత్రక మైసూర్ ప్యాలస్‌లో వేలాదిమందితో ప్రధాని మోడీ యోగాసనాలు
మైసూర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రాత్మకమైన మైసూర్ ప్యాలస్‌లో వేలాదిమందితో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యోగాసనాలు వేశారు. యోగా ప్రదర్శనలో పాల్గొని, యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరు, మైసూరు వచ్చిన మోడీ మంగళవారం ఉదయం మైసూర్ ప్యాలస్‌లో యోగా ప్రదర్శనలకు సారథ్యం వహించారు. భారతదేశ ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా అంతర్జాతీయ ప్రపంచానిక చాటి చెబుతోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. సామూహికంగా వేలాదిమంది కన్నులపండువగా యోగాసనాలు వేసిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శారీరక దారుఢ్య వ్యవస్థ అనేది ప్రపంచదేశాలమధ్య ఒక మౌలికమైన సహకార ప్రాతిపదికాంశంగా, ఒక సమస్యల పరిష్కర్తగా దోహదం చేస్తోందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) సందర్భంగా చేసే ప్రధాన కార్యక్రమానికి మైసూర్ ప్యాలస్‌లో ప్రధానమంత్రి సారథ్యం వహించారు. యోగా ద్వారా ప్రపంచానికి శాంతి లభిస్తుందని,మానవ సమాజానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నరేంద్రమోడీ అన్నారు. “యోగా మనకు శాంతిని తెచ్చిపెడుతుంది, యోగాతో శాంతి కేవలం వ్యక్తులకు వ్యక్తిగతంగానే కాదు, యావత్ సమాజానికే శాంతిని తెచ్చిపెడుతుంది,జాతికి ప్రపంచానికి శాంతి చేకూరుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా రుషులు, మహర్షులు, ఆచార్యులను ఉటంకించారు. యావత్ విశ్వాంతరాళం మన ఆత్మలోంచే ప్రారంభమైందని ఆయన అన్నారు. విశ్వం మనలోంచే పుట్టింది, ప్రతీదీ మనలోనే ఉంది, అది మనలో చైతన్యాన్ని రగలిస్తుంది అని ఆయన అన్నారు.
వ్యక్తిగత చైతన్యమే సమాజ చైతన్యంగా, ప్రపంచ చైతన్యంగా చూపుదిద్దుకుంటుదని అన్నారు. మనల్ని మన ప్రపంచాన్ని మనం తెలుసుకోగలిగితే మనలో, ప్రపంచలో తీసుకువాల్సిన మార్పులు ఏమిటనేవి మనం ఎంతో బాగా తెలుసుకోగలుగుతామన్నారు. వ్యక్తుల సమస్యలే ప్రపంచసమస్యలుగా మారతాయని, వాటిల్లో వాతావరణ సమస్యలు వంటివి ఒకటని అన్నారు.
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్ము, కేంద్ర ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్, మైసూర్ మహారాజా వంశీకుడు యధువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్, రాజమాత ప్రమోదాదేవి ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2015 నుండి ప్రతి ఏడాదీ జూన్ 21న ప్రపంచయోగా దినోత్సవం పాటిస్తున్నారు.
పలు దేశాలలో యోగా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మంగళవారంనాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించారు. ఈ సందర్భంగా వందలాదిమంది ఒకచోట చేరి యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యాన్ని సందేశాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పి స్ఫూర్తి పొందారు. పలు దేశాల్లో భారతీయ రాయబార కార్యాలయాల్లో యోగా దినోత్సవాలు ఘనగా జరిగాయయి. న్యూయార్క్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలలో యోగా ఉత్సవాలు జరిగాయి. యోగా అనేది ఈనాడు ఒక అంతర్జాతీయ పర్వదినంగా మారిందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మైసూర్‌లో అన్నారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో, బీచ్‌లలో, స్థానిక పార్కులలో, దేవాలయాలలో, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజున యోగా జీవితంలో ఒక భాగంగా మారిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా త్యాగరాజ్ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్‌లలో కూడా ఉత్సవాలు జరిగాయి. నాగాలాండ్‌లో కేంద్ర సహాయమంత్రి కౌశల్ కిషోర్, ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి పంగ్యూఫూమ్ యోగా ఉత్సవాల్లో పాల్గొన్నారు.
దేశ ప్రత్యేకతను చాటిచెప్పేదే యోగా
RELATED ARTICLES