సిద్దిపేట లేకుంటే కెసిఆర్ లేడు
నా పేరు కాపాడే ప్రజా నాయకుడు మంత్రి హరీశ్‌రావు
వేదికపైనే కెసిఆర్ ప్రశంస..మంత్రితో ఆలింగనం..
సిద్దిపేట అభివృద్ధి కోసం మరిన్ని వరాల జల్లు
సిద్దిపేటలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/సిద్దిపేట అర్బన్
అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్‌గా సిద్దిపేట పట్టణం మారిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధింపజేసిన గడ్డ సిద్దిపేట అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తన తర్వాత సిద్దిపేటను ప్రజాసేవలో ముందుకు తీసుకుపోతున్న ఆణిముత్యం వంటి నాయకుడు మంత్రి హరీశ్ రావు అని కొనియాడారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గం కొండపాక మండలం దుద్దెడలో ఐటి టవర్ శంకుస్థాపనతో మెదలైన సిఎం పర్యటన, రాష్ట్రంలోనే మొట్టమొదటి టిఆర్‌ఎస్ పార్టీ భవనం ప్రారంభోత్సవం, మిట్టపల్లి రైతు వేదిక ప్రారంభోత్సవం, సిద్దిపేట మెడికల్ కళాశాల, అనంతరం కోటి అందాల కోమటి చెరువు నెక్లెస్ రోడ్డును పరిశీలించి, చెరువు ప్రాంతం లో కాలినడకతో తిరుగుతూ పాత రోజులను కెసిఆర్ గుర్తుకు చేసుకున్నారు. తరువాత సిద్దిపేట అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ, నర్సాపూర్ రెండు పడుకల ఇళ్ల పైలాన్ ఆవిష్కరించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. రంగనాయక్ సాగర్ వద్ద అతిథి గృహం ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ సిద్దిపేట సిగలో మరో మణిహారంగా చెప్పుకునే 160 కోట్లతో 76 కి.మీటర్ల బైపాస్ రోడ్డు దుద్దెడ రాజీవ్ రహదారి నుంచి మెదలై 24 గ్రామాలను కలుపుతూ మళ్లీ దుద్దెడ రాజీవ్ రహదారి వరకు బిటి రింగ్‌రోడ్డుగా విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. దీనికి వెంటనె జిఒ విడుదల చేయనునట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే దీంతో సిద్దిపేట పట్టణానికి రాకుండానే నలుదిక్కులా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ ప్రజలకు అనువుగా ఉంటుందన్నారు. పలు అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు, రంగనాయక్ పర్యాటక అభివృద్ధి కోసం 100 కోట్లు అదిస్తానని సిఎం ప్రకటించారు. అలాగే కోటి అందాల కోమటి చెరువుకు అధునాతన లైటింగ్, మరిన్ని హంగుల కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. నాటి కరెంట్, తాగునీటి కష్టాల నుండి నేడు 24 గంటలు అందిస్తూ పటిష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంఎల్‌సిలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తమరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లు, వంటేరు ప్రతాపరెడ్డి, జెడ్‌పి చైర్మన్ రోజా రాధాకృష్ణ్ర శర్మ, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, స్థానిక సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశానికే రోల్ మోడల్‌గా సిద్దిపేట
RELATED ARTICLES