డిమాండ్లకు ఒప్పుకోకపోతే రైల్‌రోకోలు, రాస్తారోకోలు
కేంద్రానికి రైతుల అల్టిమేటమ్
ప్రతిపాదనలను పరిశీలించాలని వ్యవసాయ మంత్రి తోమర్ విజ్ఞప్తి
చర్చలకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధమేనని వెల్లడి
న్యూఢిల్లీ : వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయకపోతే రైళ్లు తిరగబోవని రైతులు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతు లు తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే రైలుపట్టాలను దిగ్బంధం చేస్తామని, ఎప్పుడన్నది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. తమ ఆందోళన ఉధృతం చేస్తామని, దేశ రాజధానికి దారితీసే అన్ని జాతీయ రహదారులను ముట్టడిస్తామని సింఘు దగ్గర జరిగిన విలేకర్ల సమావేశంలో రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి. “మా డిమాండ్లు నెరవేర్చకపోతే మేం రైలుపట్టాలను ముట్టడిస్తాం. ఎప్పుడనేది నిర్ణయించి, త్వరలోనే వెల్లడిస్తాం” అని బూటా సింగ్ అనే రైతు నాయకుడు హెచ్చరించారు. “కార్పొరేట్ శక్తులు, వ్యాపారుల కోసమే చట్టాలను చేసినట్లు కేంద్రం అంగీకరించింది. వ్యవసాయం రాష్ట్రాల జాబితాలోని అంశమైనప్పు డు, కేంద్రానికి ఆ విషయంలో చట్టాలు చేసే అధికారం ఉండదు” అని మరో నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తన స్పందన వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలను ఉధృతం చేశారు. వారికి మద్దతుగా వివిధ రాష్ట్రాల నుంచి ఇంకొంతమంది రైతులు అక్కడికి తరలివచ్చారు. దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల ప్రతిష్టంభన తొలగించేందుకు తాము పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం నాడు రైతు సంఘాల నాయకులను కోరారు. సహచర మంత్రి పీయూష్ గోయలతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒక పరిష్కారం దొరుకుతుందని తాను నమ్మకంతో ఉన్నట్లు తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధరకు రాతపూర్వక హామీ ఇస్తామని, చట్టాలలో కొన్ని సవరణలు చేస్తామని ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించారు. దీనికి స్పందనగా “రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం ఉత్సుకతగా, సిద్ధంగా ఉంద”ని తోమర్ అన్నారు. రైతు సంఘాలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని, దేశ రాజధానికి దారితీసే అన్ని మార్గాలనూ దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశాయి. పదిహేను రోజులుగా ఢిల్లీ వివిధ సరిహద్దు స్థలాల్లో వేలాది రైతులు నిరసనలు చేస్తున్నారు. కొత్త చట్టాలు కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థకు గండి కొడతాయని, వాటిని మొత్తానికే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చర్చలు కొనసాగుతుండగానే మరో ఆందోళనను ప్రకటించడం సరికాదని, రైతు సంఘాలు చర్చలకు రావాలని తోమర్ విజ్ఞప్తిచేశారు. “మా ప్రతిపాదనలు రైతులకు ఇచ్చాం. వాటిని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. ఆ ప్రతిపాదనలను కూడా చర్చించాలనుకుంటే, మేము దానికీ సిద్ధంగా ఉన్నాం” అని ఆయన తెలిపారు. ఇక కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ ఏదైనా చట్టం చేస్తారా అన్న ప్రశ్నకు, కొత్త చట్టం కనీస మద్దతు ధర మీద ప్రభావం చూపించదని, అది అలానే కొనసాగుతుందని వ్యవసాయ మంత్రి జవాబిచ్చారు. గోయల్ కూడా రైతు సోదరులు, సోదరీమణులు చర్చలకు రావాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
త్వరగా పరిశీలించండి… తోమర్
చట్టాల్లో ఏ అంశం మీదైనా రైతులకు అనుమానం ఉంటే ఎలాంటి దాపరికం లేకుండా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతుల భయాలు తొలగిపోయేందుకు తగిన వివరణలు ఇస్తామని తోమర్ అన్నారు. మేము రైతు నాయకుల నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నాం, అయితే వాళ్లు చట్టాల రద్దుకు పట్టుపడుతున్నారని ఆయన అన్నారు. ఇంకా వేలాది మంది రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చామని కూడా తోమర్ పేర్కొన్నారు. కొవిడ్ ప్రబలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చల్లటి వాతావరణంలో నిరసన చేస్తున్న రైతుల గురించే తమ ఆందోళన అంతా అని, రైతు నాయకులు ప్రభుత్వ ప్రతిపాదనను త్వరగా పరిశీలిస్తే, తర్వాతి చర్చలు ఎప్పుడన్నది నిర్ణయించ వచ్చని తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధర అలాగే ఉంటుందని, దానికి “రాతపూర్వక హామీ” ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. మూడు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించేవరకు తమ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. మండీ వ్యవస్థ బలహీనపడుతుందన్న ఆందోళనతో సహా కనీసం ఏడు అంశాల మీద తగిన సవరణలు చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్‌తో కలిసి బుధవారం రాత్రి హోం మంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని గురించి వివరించారు. విలేకర్ల సమావేశంలో పాల్గొన్న పీయూష్ గోయల్ కూడా కొత్త చట్టాల వల్ల మండీలకు ఢోకా ఉండదని, అయితే తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అదనపు అవకాశాలు కల్పిస్తాయని అన్నారు.
దేశవ్యాప్తంగా రైలుపట్టాల ఆక్రమణ!
RELATED ARTICLES