HomeNewsTelanganaదేశవ్యాప్తంగా బ్లాక్‌ డే

దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే

నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన ఎస్‌కెఎం
చండీగఢ్‌ :
హర్యానా యువరైతు మృతికి నిరసన తెలియజేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారంనాడు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే పాటించింది. ఆందోళనలు చేసింది. ఎఐకెఎస్‌ ఆధ్వర్యంలోని ఎస్‌కెఎం మూడేళ్ళక్రితం ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిన్నరకాలం రైతులు చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించింది. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, ప్రజాసంఘాలు హర్యానా పోలీసు చర్యలకు వ్యతిరేకం గా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. యువరైతు శుభకరన్‌ మృతికి సంతాపదినం పాటించాయి. ఆయన మృతికి కారకులపై కఠిన చర్య లు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల బిజెపి నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కేంద్రమంత్రి అమిత్‌ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ రాజీనామా చేయాలని కోరారు. అదేవిధంగా ఈనెల 26న రైతులు ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానానికి ట్రాక్టర్‌ ర్యాలీ తలపెట్టారు. మార్చి 14న ఢిల్లీ చలో కార్యక్రమాన్ని తలపెట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రస్తుతం హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలో భాగం పంచుకోలేదు. ఖనౌరీ సరిహద్దుల్లో ఇప్పటివరకూ వందలమంది రైతులు గాయపడగా శుభకరన్‌ మరణించారు. మరో 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని ఎస్‌కెఎం డిమాండ్‌ చేస్తున్నది. 2021లో లఖింపూర్‌ ఖేరి వద్ద రైతులను హత్యచేసిన కేంద్ర హోంమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను కఠినంగా శిక్షించాలని, అతడి తండ్రి అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కూడా ఎస్‌కెఎం డిమాండ్‌ చేస్తున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఎస్‌కెఎం కోరుతున్నది. కాగా ఎస్‌కెఎంలో భాగంగా ఉన్న భారతి కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహాన్‌) శుక్రవారంనాడు పంజాబ్‌లోని 17 జిల్లాల్లో 47 ప్రాంతాలలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపింది. శుభకరన్‌ మృతికి కారకులైన హర్యానా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బికెయు (ఏక్తా ఉగ్రహాన్‌) ప్రధాన కార్యదర్శి సుఖదేవ్‌ సింగ్‌ కోక్రికలన్‌ మాట్లాడుతూ, కేంద్రమంత్రి అమిత్‌ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్యా నా హోంమంత్రి అనిల్‌ విజ్‌ వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. అమృత్‌సర్‌లో కూడా రైతులు న్యూ గోల్డెన్‌ గేట్‌ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. బిజెపి నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఎస్‌కెఎం నాయకుడు రత్తన్‌సింగ్‌ రణ్‌ధవ మాట్లాడుతూ, డెంకీ, మహిమ, పండ్రో, మోధే, రటోకీ సహా సరిహద్దులవెంట పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు గ్రామాల్లో జరిగాయని చెప్పారు. లూధియానాలో కూడా ఎస్‌కెఎం, కార్మిక సంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు జరిపాయి. మినీ సెక్రటేరియట్‌ వెలుపల ప్రదర్శన జరిపారు. అమిత్‌ షా, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌, హోంమంత్రి విజ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కోరారు. హోషియార్‌పూర్‌జిల్లాలో కూడా రైతులు నిరసన ప్రదర్శనలు జరిపారు.
రైతు నాయకులపై ఎన్‌ఎస్‌కె కేసు లేదు
ఆందోళన చేస్తున్న రైతు నాయకులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద కేసు నమోదు చేయాలని హర్యానా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఐతే తర్వాత రైతుల తీవ్ర వ్యతిరేకతతో వారు వెనక్కు తగ్గారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.జాతీయ భద్రతా చట్టం కింద రైతు నాయకులను నిర్బంధించి 1980 నాటి ఎన్‌ఎస్‌ఎ చట్టంలోని సెక్షన్‌ 2(3) కింద కేసులు పెట్టాలని అంబాలా పోలీసులు తొలుత నిర్ణయించారు. తర్వాత వెనక్కు తగ్గారు. ఆందోళన చేస్తున్న రైతు నాయకులు సంయమనం పాటించాలని, శాంతియుత పద్దతులు అవలంబించాలని పోలీసు ఉన్నతాధిఆరి అంబాలా రేంజ్‌ ఐజి సిబాశ్‌ కవిరాజ్‌ కోరారు. సోషల్‌ మీడియా వేదికల ద్వారా రెచ్చగొట్టే పోస్టింగులు పెట్టవద్దని ఆయన కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ యూనియన్‌లు హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు నాయకత్వం వహించి ముందుకు నడిపిస్తున్నాయి.
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తేనే శుభకరన్‌ అంత్యక్రియలు
హర్యానా సరిహద్దుల్లో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో హతుడైన యువరైతు శుభకరన్‌ (21) అంత్యక్రియలు నిర్వహించేందుకు రైతులు నిరాకరించారు. శుభకరన్‌ మరణానికి కారకులైన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేవరకూ ఆయన అంత్యక్రియలు జరిపేదిలేదని ఆందోళన చేస్తున్న రైతులు స్పష్టం చేశారు. ఐతే పంజాబ్‌ ముఖ్యమంత్రి మాన్‌ శుక్రవారంనాడు యువరైతు కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని, అతడి సోదరకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటన చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎక్స్‌ వేదికగా పోస్టింగ్‌ పెట్టారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది రైతులను ఈనెల 13న హర్యానా సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే ఉండిపోయి తీవ్ర నిరసన, ప్రదర్శనలు జరుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరు వృద్ధ రైతులు గుండె పోటుతో సరిహద్దుల్లో మరణించగా తాజాగా మరో రైతు కూడా గుండె పోటుతో మరణించారు. గడచిన భుధవారం హర్యానా పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో యువరైతు శుభకరన్‌ మరణించారు. పంజాబ్‌ రాష్ట్రం భటిండా జిల్లాకు చెందిన యువరైతు ఖనౌర్‌ సరిహద్దుల్లో జరిగిన పోలీసు దాడిలో మరణించారు. ఆయన తలకు చాలా పెద్దగాయమైంది. దీంతో దేశవ్యాప్తంగా రైతులు గురువారం నిరసన ప్రదర్శనలు జరిపారు. యువత రైతు అంత్యక్రియలు నిర్వహించేందుకు రైతు సంఘాల నాయకులు నిరాకరించారు. అతడికి న్యాయం చేయాలని, అతడి మరణానికి కారకులైనవారిపై కేసులు నమోదు చేయాలని రైతు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. దీంతో శుభకరన్‌ భౌతిక దేహానికి పోస్టుమార్టం జరగడానికి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. పటియాలాలోని రాజిందర్‌ ఆసుపత్రిలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ యువరైతు తలపై అతిపెద్దగాయం ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు స్వరన్‌ సింగ్‌ పాధేర్‌ పటియాలాలో శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, శుభకరన్‌ మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments