సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
‘ఇంటింటికీ సిపిఐ’ పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాపక్షం/హైదరాబాద్ దేశమంతటా బిజెపి వ్యతిరేక పవనాలు వేగంగా వీస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రోజురోజుకూ బిజెపి సీట్లు తగ్గుతున్నాయని, కర్నాటక ఎన్నికల్లో కూడా బిజెపికి సీట్లు తగ్గుతాయన్నారు. మోడీ అవినీతి, అదానీ, అంబానీలతో ఉన్న అనుబంధం, క్విడ్ ప్రోకో అంశాలపై 2024లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ విచారణలో బహిర్గతమవుతాయని, అప్పుడు మోడీ జైలుకు వెళ్లాలి వస్తుందన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు దేశ వ్యాప్తంగా ‘బిజెపి కో హఠావో, దేశ్‌కో బచావో ’ నినాదంతో ‘ఇంటింటికీ సిపిఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపిని గద్దె దించే క్రమంలోనే తమ యాత్ర కొనసాగుతుందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పులను కూడా ఎండగడుతామని స్పష్టం చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, కలవేని శంకర్, బాగం హేమంతరావు, బాలనర్సింహతో కలిసి హైదరాబాద్‌లోని మగ్ధుంభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ‘బిజెపి కో హఠావో, దేశ్ కో బచావో ’ నినాదంతో ‘ఇంటింటికీ సిపిఐ’ వాల్‌పోస్టర్‌ను కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.
అంతకుముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మొత్తం 4128 ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో బిజెపికి 664 మాత్రమే ఉన్నారని, మొత్తంలో ఇది 15 శాతం మాత్రమేనన్నారు. బిజెపి సొంతంగా, తమ మిత్రులతో కలిసి మొత్తం 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే, బిజెపేతర పార్టీలు 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయన్నారు. ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను దర్వినియోగం చేస్తే ఆ ఉచ్చు ప్రధాని మోడీ మెడకే చుట్టుకుంటుందని, రాబోయే 2024లో మోడీకి అదే గతి పడుతుందన్నారు. బ్యాంకులను ఎగ్గొట్టి పారిపోయే వారు సంతోషంగా ఉంటున్నారని, ఈ అంశాన్ని ప్రశ్నించిన వారిపైన మాత్రం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకులను ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా,లలిత్ మోడీ, నీరవ్‌మోడీ,అదానీ లాంటి 28 మంది ఆస్తులను జప్తు చేయాలని, వారి వద్ద ఉన్న ధనం, అలాగే దేశంలోని మొత్తం నల్లధనంపై ఒక శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని ప్రజాస్వామ్య విలువలను గౌరవించేవారైతే బిజెపి నేతలు యథేచ్చగా చేస్తున్న వ్యాఖ్యలను నియంత్రించాలని, కానీ ఆయనే ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే రాహుల్ గాంధీ జన్మకు సంబంధించిన అంశంపై ఒక పార్లమెంట సభ్యులు వ్యాఖ్యనిస్తే ఆయనపై ఎలాంటి చర్యలూ లేవన్నారు. రాహుల్ గాంధీపేరులో గాంధీ ఎందుకు ఉండాలంటూ బిజెపి నేతలు, ఎంపిలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, ఇలాంటి దూషణలతో భారతదేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మంటగలుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజున బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గాడ్సేబొమ్మను, మరో పక్క శ్రీరాముని బొమ్మను పెట్టుకుని ఉరేగింపు తీస్తే అలాంటి వారిపై కేసులు లేవన్నారు. ప్రజాస్వామ్యం లేదని లండన్‌లో రాహుల్ చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఫాసిస్ట్ విధానాలను ప్రపంచం గమనిస్తుందన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని లొగొద్దని రాజకీయాలు వేరు, మతాలు వేరు అని ఈ విద్వేషాలకు తెరదించాలని ఇటీవల సుప్రీం సూచించిందన్నారు. బిల్కిస్ బాన్‌ను అత్యాచారం చేసిన, ఏడుగురిని క్రూరంగా చంపి యావజ్జీవ శిక్ష పడిన వారిని ప్రభుత్వం విచక్షణతో విడుదల చేయడం సమాజానికి మంచి సంకేతం కాదని సాక్షాత్తు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యానించడం దేశంలో బిజెపి పాలన ఎలా సాగుతుందో స్పష్టం అవుతుందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నదన్నారు.
ప్రస్తుతం ఫాసిస్ట్ తరహా పాలన కొనసాగుతోందని ఇవాళ అర్థమవుతోందన్నారు. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాలలో వేరు వేరు చట్టాలు లేకుండా తటస్థంగా ఉండే ఒకే చట్టం చేయాలని , అందరికీ ఒకే మతం ఉండేలా చట్టం చేయాలని అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి తగు మార్గదర్శకాలు జారీ చేయాలని బిజెపి నాయకులతో సహా 16 మంది కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేస్తే దీనిని నిర్దందంగా తిరస్కరించారని కూనంనేని గుర్తు చేశారు. ఒకే మతం, ఒకే జాతి, ఒకే రరకమైన వివాహాలు, ఒకే రకమైన సాంప్రదాయాలు, సంస్కృతి, ఒకే ఎన్నిక, ఒకే ప్రభువు, ఒకే పాలకుడు ఉండాలనేది బిజెపి ఆలోచనలో నుంచి పుట్టినదేనవే నని అన్నారు. పోడుభూములు, ఇండ్ల స్థలాల పోరాటం అంశంలో తమపైన కూడా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, రంగారెడ్డి జిల్లాలో ఇంట్లో ఉన్న న్యాయవాది యాదయ్యపై కూడా కేసు నమోదు చేసిన విషయాన్ని కూనంనేని వివరించారు. అక్రమ కేసులు పెడితే వాటిని ఎదుర్కొంటామని, కేసులు తమకు పెద్ద విషయం కాదన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా సిపిఐ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకుంటున్నారని, ఇలాంటి స్థలాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి, ఆ భూములు ప్రభుత్వానివే అని తేలితే, వెంటనే గుడిసెవాసులకు స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. 58 జివో ప్రకారం పేదలకు ఆ స్థలాలు ఇవావలని, జివో 59 ప్రకారం మార్కెట్ కాకుండా తక్కువ ధరలకే ఇవ్వాలని కోరారు. విభజన హామీలో భాగంగా బయ్యారంలో చేపట్టిన సిపిఐ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ యాత్రకు 32 వేల మంది పార్టీ శ్రేణులు హాజరవ్వగా,50 వేలకు పైగా పలు సభలలో పాల్గొన్నారన్నారు. తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజల పట్ల బిజెపి ప్రభుత్వం మరింత కక్షగా వ్యవహారిస్తోందని, అలాంటి బిజెపి ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలని అడిగేందుకు ప్రజల వద్దకు రాబోతోందని, అందుకే ప్రజలలో చైతన్యం కల్పిస్తామన్నారు. ఇటీవల నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లినప్పడు అక్కడి ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడారని, బిజెపికి ఓట్లు వేయబోమని స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు. సిబిఐ సంస్థను వ్యతిరేకిస్తూనే పేపర్ లికేజీ కేసును సిబిపిఐకే అప్పగించాలని కాంగ్రెస్ కోరడం సరైంది కాదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ కేసును సిట్, సిబిఐతో కాకుండా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 14న ఇందిరాపార్క్ వద్ద ప్రారంభ సభ
మే 14న కొత్తగూడెంలో ముగింపు సభ
‘బిజెపి కో హఠావో, దేశ్‌కో బచావో ’ నినాదంతో ఈ నెల 14న చేపట్టబోయే ‘ఇంటింటికీ సిపిఐ’ ప్రారంభ సభను హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్నట్టు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. తొలుత లిబర్టీలోని డాక్డర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం నుంచి యాత్రను ప్రారంభించి, ఇందిరాపార్క్ వద్ద సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా,జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. మే 14న కొత్తగూడెంలో లక్ష మందితో ముగింపు సభను నిర్వహస్తామన్నారు. ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, రాజ్యసభ సభ్యులు బినయ్‌విశ్వం, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్ పాల్గొంటారని కూనంనేని వివరించారు.
ఈనెల 9న సిపిఐ, సిపిఐ(ఎం) సంయుక్త సమావేశం
ఈనెల 9న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో సిపిఐ, సిపిఐ(ఎం) సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ(ఎం) కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘువు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో రెండు పార్టీలకు చెందిన ముఖ్యులు, మండల నాయకులు సుమారు పది వేల మంది వరకు హాజరవుతారని తెలిపారు.
మోడీ సర్కార్‌ది దోచుకో..దాచుకో విధానం : చాడ వెంకట్ రెడ్డి
బిజెపి అధికారంలోనికి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో అన్ని వర్గాలపైన దాడులు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలుగా ధరలు పెంచడంతో సామాన్యులు, పేదలపై తీవ్ర భారంపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం చమురు కంఎనీలకు అమ్ముడపోయిందని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని, సహజవనరులను వారికి కట్టబెడుతోందని విమర్శించారు. దోచుకో.. దాచుకో అనే సిద్ధాంతం ద్వారా కార్పొరేట్ శక్తులకు నరేంద్రమోడీ ప్రభుత్వం ద్వారాలు తెరిచిందని ద్వజమెత్తారు. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం కొనసాగుతోందని, అణచివేత, ప్రతిపక్ష గొంతులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాల, సామాన్యులపై భారాలు మోపుతున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని చాడ హెచ్చరించారు. మోడీ, బిజెపికి హఠావో, దేశ్‌కు బచావో అనే నినాదంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సిపిఐ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నదన్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్ ఇలా అనేక సమస్యలపై కూడా ప్రస్తావిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తామని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.