HomeNewsBreaking Newsదేశం మొత్తానికి ‘హిందీ’ని రుద్దొద్దు

దేశం మొత్తానికి ‘హిందీ’ని రుద్దొద్దు

భారత రాజ్యాంగం ఏ భాషకూ అధికారిక హోదా ఇవ్వలేదు
కేంద్ర విధానాన్ని నిరసించిన రాష్ట్ర మంత్రి కెటిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదని, రాజభాషగా హిందీకి పట్టం కట్టలేదని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటి.రామారావు అన్నారు. కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించాలనే కేంద్ర నిర్ణయం, సమాన అవకాశాలు పొందేలా రాజ్యాంగం కల్పించిన హక్కు ను కాలరాయడమేనని ఆరోపించారు. ఐఐటి, ఎన్‌ఐటి వంటి ప్రపంచస్థాయి ప్రమాణాలుగల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలని హోంమంత్రి అమిత్‌ షా నేతత్వంలోని కమిటీ రాష్ర్టపతికి నివేదిక సమర్పించడం పట్ల మండిపడ్డారు. దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ కెటిఆర్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం లేఖ రాశారు. ప్రపంచ స్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, మల్టీనేషనల్‌ కంపెనీల్లో మన యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్‌ మీడియంలో చదవడమే కారణమన్నారు. మోడీ ప్రభుత్వం హిందీ భాషకు అనవసర ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని తిరోగమన స్థితిలోకి వేగంగా తీసుకుపోతుందని విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను కచ్చితం చేయాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కెటిఆర్‌ తెలిపారు. అన్ని భాషలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్న భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హిందీ భాషను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని ప్రధాని మోడీని డిమాండ్‌ చేశారు. అలాగే అమిత్‌ షా నేతృత్వంలోని కమిటీ నివేదికను పక్కనపెట్టాలని డిమాండ్‌ చేశారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఇంగ్లీష్‌, హిందీలకే ప్రాధాన్యత ఇచ్చి తన చిత్తశుద్ధిలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న తెలుగు రాష్ట్రాల యువకుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని కెటిఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 2020 నవంబర్‌ 18వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 345 ప్రకారం అధికారిక భాష అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారు
ఢిల్లీలో ఉండే కొంతమంది బ్యూరోక్రాట్లు, నేతలు ఇంకా బ్రిటిష్‌ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారనడానికి సివిల్స్‌ ప్రాథమిక(ప్రిలిమ్స్‌) పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లీష్‌, హిందీలో ఉండడమే ఇందుకు సాక్ష్యమని కెటిఆర్‌ అన్నారు. బలహీన వర్గాలంటే ఆయా వ్యక్తులకు ఉండే చిన్నచూపు, ప్రాంతీయ వివక్షతో సివిల్స్‌ పరీక్షల్లో గ్రామీణ అభ్యర్థులకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆరోపించారు. ఈ సంకుచిత ఆలోచన విధానంతో దేశ యువత తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంతో పాటు మెయిన్స్‌, ముఖాముఖిలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే బోర్డులు ఏర్పాటు చేయాలని కెటిఆర్‌ ప్రధాని మోడీని డిమాండ్‌ చేశారు. యుపిపిఎస్‌సి నిర్వహించే ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌ సర్వీసు పరీక్షలతో పాటు గిరిజనులు, గ్రామీణులతో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారుల ఎంపికలోనూ ఇంగ్లీషుకు మాత్రమే పెద్దపీఠ వేయడం అన్యాయమన్నారు.
కేంద్రమంత్రి నిర్మలా హామీ ‘జుమ్లా’
బ్యాంకు నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండేళ్ల క్రితం ఇచ్చిన హామి “జుమ్లా” తప్ప మరొకటి కాదని కెటిఆర్‌ విమర్శించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పథకాలు దాదాపు బ్యాంకుల ద్వారానే అమలవుతాయని, స్థానిక భాష తెలియని బ్యాంకు సిబ్బందితో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 2014 ముందు వరకు ప్రాంతీయ భాషల్లో బ్యాంకు నియామక పరీక్ష రాసే అవకాశం ఉండేదని, కానీ ప్రస్తుతం ఇంగ్లిష్‌, హిందీల్లోనే నిర్వహిస్తుండడంతో ప్రాంతీయ భాషలో చదువుకున్న స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments