ప్రతిపక్షాల ఐక్యత చరిత్రాత్మకం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశం కోసం ఏకమవుతామని, ప్రతిపక్షాల ఐక్యత చరిత్రాత్మకమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పోరాడతాయని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపిని కట్టడి చేసేందుకు ఒకేతాటిపై నడవాలని ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అగ్రనేతలు నిర్ణయించారు. రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జెడి చైర్మన్ తేజస్వీ యాదవ్, జెడియు అధ్యక్షుడు రాజీవ్ రంజన్‌సింగ్, ఆర్‌జెడి రాజ్యసభ ఎంపి మనోజ్ కుమార్ ఝా తదితరులు కూడా హాజరైన ఈ సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఏకం కావడాన్ని చారిత్రక చర్యగా అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా జరిగే సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ అన్ని పార్టీలను తీసుకెళుతుందని చెప్పారు. నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. వీలైనన్ని ఎక్కువ రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కలిసి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడతామని ఖర్గే అన్నారు. ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, పలు అంశాలను చర్చించామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, బిజెపికి తగిన సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
బిజెపి ఓటమే లక్ష్యంగా : కేంద్రంలో ప్రజావ్యతిరేక రాజ్యం చెలాయిస్తున్న బిజెపిని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని తన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను నితీశ్ కలిశారు. బిజెపిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసే ప్రయత్నాలపై చర్చించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష, అధికార పార్టీలు ఇప్పటి నుంచే గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాలూను నితీశ్ కలిశారు. ఇటీవల కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ ఆరోగ్యం గురించి ఆయనతో తాను ఫోన్ లో టచ్ లో ఉన్నాననీ, ఆయనను భౌతికంగా కలవడం చాలా ముఖ్యమని భావించానని చెప్పారు. అందుకే ఆయనను కలిసి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నానని అన్నారు.
దేశం కోసం ఏకమవుతాం
RELATED ARTICLES