HomeNewsBreaking Newsదేశం ఎవరి సొత్తూ కాదు

దేశం ఎవరి సొత్తూ కాదు

రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి
సొంత ఎజెండాను ప్రజలపై రుద్ది పాలిస్తే చూస్తూ ఊరుకోం
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/కరీంనగర్‌ ప్రతినిధి
ఈ దేశం ఎవరి సొత్తూ కాదని, భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని, రాజ్యాంగ పరమైన పాలన సాగాలి కానీ సొంత ఎజెండాను ప్రజలపై రుద్ది పరిపాలిస్తే చూస్తూ ఊరుకోమని కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. దేశం లో ధరలు నానాటికీ పైపైకి పోతున్నాయని, వాటిని అదుపు చేయడంలో మోడీ ప్రధాని ఘోరంగా విఫలమయ్యారన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, డిజిల్‌, నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదని, దీనికి పాలకుల విధానాలే కారణమన్నారు. కార్మిక చట్టాలను కాలరాసి లేబర్‌ కోడ్లు మార్చారని, చెమట చుక్కలు చిందించి, నెత్తురు ధారపోసి కమ్యూనిస్టులు సాధించిన కార్మిక చట్టాలను బతికించుకుంటామన్నారు. కమ్యూనిస్టులు లేరని, వారి పనిపోయిందని అని తప్పు డు ప్రేలాపనలు పేలుతున్న వారికి ఈ ప్రజాపోరు యాత్ర ఓ చెంపపెట్టువంటిదన్నారు. అధికారం , పదవులు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేది కమ్యూనిస్టులేనన్నారు. ఎన్నికల హామీలు మరిచి కార్మిక హక్కులు కాలరాసే మతోన్మాద బిజెపిని ఓడించేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని చాడ పిలుపునిచ్చారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. చాడ మాట్లాడుతూ దేశంలో అధికారం చెలాయిస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి స్నేహ ప్రీతిని ప్రదర్శిస్తూ అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. మతోన్మాదం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలను అనుసరిస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, రాముని పేరుతో జపం చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బిజెపి ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే దేశం సర్వనాశనం అవుతుందని, అందుకు పొరుగు దేశమైన పాకిస్తానే నిదర్శనమన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్ని శక్తులను కలుపుకుని బిజెపిని గద్దె దించేంత వరకు విశ్రమించేదే లేదన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, గిరిజన, గిరిజనేతరులకు పోడు పట్టాలివ్వాలని, జిల్లాలో సాగునీటి వనరులను మరింత కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమీ లేదన్నారు. పూటకో రంగు మార్చే వారితో అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. ధన బలం చూసుకుని జనాలను కొనేవారు వారి గుండెల్లో ఎప్పటికీ స్థానం సంపాదించలేరని చెప్పారు. ఉద్యమాల పురిటిగడ్డపై అనేక మంది వచ్చి పోతుంటారని, కానీ నిరంతరం ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్‌, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మహిళా సమాఖ్య నాయకులు గూడెం లక్ష్మి, కిన్నెర మల్లవ్వ, యాద పద్మ, సిపిఐ నాయకులు పొనగంటి కేదారి, ఉమ్మెంతల రవీందర్‌ రెడ్డి, డ్డి సమ్మయ్య, బుచ్చన్న యాదవ్‌, మచ్చ రమేష్‌, వెంకటేష్‌, మల్లేషం, పైడిపల్లి రాజు, నలువాల సదానందం తదితరులున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments