HomeNewsBreaking Newsదేశం అపఖ్యాతి పాలైంది

దేశం అపఖ్యాతి పాలైంది

దారికడ్డంగా మేకులు నాటి గోడలు కడతారా?
ఇంత నిర్దయా? ఇంత క్రూరత్వమా?
రైతులను శత్రువులుగా చూడకండి
చట్టాల రద్దుపై సభలో ప్రధాని ప్రకటన చేయాలి
ప్రతిపక్షాల డిమాండ్లతో దద్దరిల్లిన పార్లమెంటు
సభ్యుల నిరసనలతో హోరెత్తిన ఉభయ సభలు
రాజ్యసభలో ముగ్గురు ఎంపిల సస్పెన్షన్‌
న్యూఢిల్లీ : రైతు చట్టాల సమస్యపై ప్రత్యేక చర్చ చేయాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో పట్టుపట్టాయి. దాంతో పార్లమెంటు ఉభయ సభలూ పలు పార్టీల నిరసనల హోరుతో దద్దరిల్లిపోయాయి. వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని, రైతులను శత్రువులుగా చూడవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడంతో బుధవారంనాడు ఉభయసభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. రైతుల ఆందోళన, చట్టాల రద్దు డిమాండ్లే ప్రధానాంశాలుగా ముందుకు వచ్చాయి. లోక్‌సభ సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కాగానే, ఉభయ సభల్లోనూ పలు పార్టీలు రైతుల ఆందోళనపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌధురి లోక్‌సభలో ఈ సమస్య లేవనెత్తారు. “వ్యవసాయ చట్టాల సమస్య వల్ల దేశ ప్రతిష్ఠ అపఖ్యాతిపాలైంది, మేం తీవ్ర ఆందోళనతో ఉన్నాం” అన్నారాయన. పలు పార్టీ ల సభ్యులు లోక్‌సభమధ్యలోకి దూసుకువచ్చి తమ ఆందోళన వ్య క్తం చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులను తమ తమ సీట్లలోకి వెళ్ళి కూర్చోవలసిందిగా అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. సభా గౌరవం కాపాడాలని లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించా రు. ప్రశ్నోత్తరా సమయం చాలా ముఖ్యమైనది, దాన్ని కొనసాగనియ్యండి అని పదే పదే ఆయన కోరారు. కానీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తులను తిరస్కరించి, ప్రశ్నోత్తరాల్ని అరగంటసేపు వాయిదా వేయాలని కోరారు. సభ తిరిగి సమావేశమయ్యాక రాష్ట్రపతి ప్రసంగంపైన, రైతుల సమస్యపైన వేరు వేరుగా ప్రత్యేక చర్చ చేపట్టాలని చౌధురి డిమాండ్‌ చేశారు. మీ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి చాలినంత సమయం, అవకాశం ఉంది, ముందు మీరు వెళ్ళి మీ మీ స్థానాల్లో కూర్చోండి అని స్పీకర్‌ ప్రతిపక్షాలను కోరారు. మీకు చర్చ కావాలంటే మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి, లేదంటే మీ మీద చర్య తీసుకుంటాను అని ఆప్‌ సభ్యుడు భగవంత్‌ మాన్‌ను స్పీకర్‌ హెచ్చరించారు. అయినా ప్రతిక్షాలు రైతు సమస్యే ధ్యేయంగా ఆయన మాట లక్ష్యపెట్టలేదు. సభా కార్యకలాపాల్ని సాయంత్రం ఐదుగంటల వరకు వాయిదా వెయ్యాలని కోరాయి. రాజ్యసభలోనూ ఇవే దృశ్యాలు చోటుచేసుకున్నాయి. సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత సభ్యులు సభ మధ్యలోకి దూసుకొచ్చారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. వారి నినాదాలతో రాజ్యసభ హోరెత్తిపోయింది. శూన్య గంట లో చేపట్టాల్సిన కార్యకలాపాల్ని ప్రారంభిద్దామని స్పీకర్‌ పదే పదే ప్రతిపక్ష సభ్యుల్ని కోరినప్పటికీ, సభ్యుల నినాదాలు ఆగలేదు. శిరోమణి అకాలీదళ్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి హరిసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌

కూడా సభామధ్యంలోకి దూసుకొచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ గురించి ప్రతిపక్ష పార్టీల నాయకులతో తాను మాట్లాడినప్పుడు అంగీకరించారని, ఇప్పుడు సభలోకొచ్చాక మాట మార్చారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. కాంగ్రెస్‌, ఆప్‌, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలకు చెందిన సుమారు 20 మంది సభ్యులు సభ మధ్యలోకి వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో నవంబరు నెల నుండి జరుగుతున్న రైతుల ఆందోళన మీ చెవిన పడలేదా అని వారు అన్నారు. చివరకుతీవ్ర నిరసనలు, నినాదాలు, గందరగోళం మధ్య రాత్రి ఏడు గంటలకు సభ వాయిదా పడింది. రాజ్యసభలో కూడా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవసాయ చట్టాల రద్దుపై తనకుతానుగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఈ డిమాండ్‌ చేసిన సమయంలో మోడీ సభలోనే ఉన్నారు.గణతంత్ర దినోత్సవంరోజున జాతీయ జెండాకు జరిగిన అగౌరవం సహింపరానిది అంటూ ఆ చర్యను ఆయన ఖండించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, రైతుల ఆందోళనోద్యమం సందర్భంగా జాడ తెలియకుండా పోయిన రైతుల జాడ కనిపెట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి అని ఆయన అన్నారు. తమ పాలనలో కూడా రైతుల కోర్కెలను తాము నెరవేర్చామంటూ ఆయన అనేక ఉదాహరణలు ఉటంకించారు. రైతు అంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాత, ఆ విషయంలో వారితో ఘర్షణ పడటానికేమీ లేదు, ముందు వారి సమస్య ప్రధానమైనది, కానీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం వంటి ఇతర ముఖ్య సమస్యలపై దృష్టి పెడుతోంది అని విమర్శించారు. డిఎంకె సభ్యుడు తిరుచ్చి శివ కూడా చట్టాల రద్దుకు ప్రధాని రైతులకు హామీ ఇవ్వాలని కోరారు. సమాజ్‌వాదీపార్టీ నాయకుడు రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రైతులను రాజధానిలోకి రానీయకుండా మేకులు పరిచి, అబేధ్యమైన ఆటంకాలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వాన్ని దునుమాడారు. ప్రభుత్వం చాలా నిర్దయగా ప్రవర్తిస్తోంది, రైతులను ప్రభుత్వం శత్రువులుగా చూస్తోంది, వారి డిమాండ్‌లు పరిగణనలోకి తీసుకుని చట్టాలను రద్దు చేయండి అని కోరారు. రైతులు తిరగబడినప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు పదవుల నుండి వైదొలగాలి అని రామ్‌ గోపాల్‌ యాదవ్‌ హెచ్చరిస్తూ, “ప్రజలు అధికార దాహాన్ని సహించరు, మీరు రైతులతో మాట్లాడండి, మనది ప్రజాస్వామ్యం, విస్తారమైన జనాభాగల దేశం మనది, వారి దగ్గరకు వెళ్ళండి, వాళ్ళకు నచ్చజెప్పండి..మేం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంటాం, అందరి ఆమోదంతో కొత్త చట్టాలు తెస్తాం అని చెప్పండి” అన్నారాయన. రైతు ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల పరిహారం, వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని ఆయన డిమాండ్‌ చేశారు. మీరు రైతులకు శత్రువులా? అని ఆయన ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవంపై రైతులపై లేని కేసులు బనాయించారని సిపిఎం సభ్యుడు ఎలమరం కరీం విమర్శించారు.

మార్షల్స్‌ సాయంతో ఆప్‌ ఎంపిల సస్పెన్షన్‌
రైతుల ఆందోళనపై రాజ్యసభ అట్టుడికింది. కార్పొరేట్‌ వ్యాపారులకు మేలు చేసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ బుధవారంనాడు రాజ్యసభ కార్యకలాపాలను ఆసాంతం అడ్డుకున్న సంజయ్‌సింగ్‌ సహా ముగ్గురు ఆప్‌ ఎంపిలను మార్షల్స్‌ ఎత్తుకుని బయటకు తీసుకుపోయారు. రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆప్‌ ఎంపీలు చట్టాల రద్దుకు మంకుపట్టు పట్టి సభను అదేపనిగా అడ్డుకోవడంతో ఛైర్మన్‌ మార్షల్స్‌ను ప్రయోగించారు. బడ్జెట్‌ సమావేశాల ఆరంభంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ చర్చకు తీసుకున్న వెంటనే, వ్యవసాయ సంస్కరణల చట్టాలు రద్దు చేయాలి అని నినాదాలు చేస్తూ ఆప్‌ ఎంపీలు సభ మధ్యలోకి దూసుకువెళ్ళారు. సభకు ఆటంకం కలిగించవద్దని, సీట్లలోకి వెళ్ళి కూర్చోవాలని సభాధ్యక్షుడు పదే పదే చేసిన విజ్ఞప్తులను ఆప్‌ ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో రోజంతా సభకు హాజరు కానీయకుండా వారిని సస్పెండ్‌చేస్తూ వెళ్ళిపోవాల్సిందిగా కోరుతూ ఛైర్మన్‌ సంబంధిత నిబంధనలు అమలు చేశారు. ఆప్‌ ఎంపీలు ఇవేమీ పట్టించుకోపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేసినప్పటికీ వారు సభలోంచి కదలకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభ తిరిగి మొదలయ్యాక కూడా ఛైర్మన్‌ వారికి పదే పదే విజ్ఞప్తులు చేసినా పట్టించుకోపోవడంతో ఆప్‌ సభ్యులు సంజయ్‌సింగ్‌, సుశీల్‌కుమార్‌ గుప్త, ఎన్‌.డి.గుప్తలను పేరుపెట్టి మరీ సంబోధించి మార్షల్స్‌తో బయటకు పంపారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చకు కాలపరిమితిని పొడిగించేందుకు అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయాన్ని కోరుతున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించగానే, రైతుల ఆందోళనపై 15 గంటల చర్చ కాలపరిమితికి అదనంగా మరో ఐదు గంటలు ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సమయం పడుతుందనే ఉద్దేశంతో మొదట ఈ గందరగోళం ఆరంభమైంది. వారిని సస్పెండ్‌ చేసిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి బిజెపి సభ్యుడు భువనేశ్వర్‌ కలిత ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments