ప్రభుత్వ నిరుద్యోగ గణాంకాలన్నీ కాకిలెక్కలే
దుర్భరంగా మారిన కోట్లాదిమంది జీవన పరిస్థితి
రాజ్యసభలో సిపిఐ తీవ్ర ఆందోళన
నిరుద్యోగులకు వేతన మద్దతివ్వాలని ఎంపి బినోయ్ విశ్వం డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యో గ సమస్య విపరీతంగా పెరిగిపోతోందని రాజ్యసభలో సిపిఐ బుధవారనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శూన్యగంటలో సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పేట్రేగుతోందని ఆయ న పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని పేర్కొం టూ, ప్రభుత్వం వారికి అండగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వచ్చి వారికి వేతన మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం నిరుద్యోగ కేలండర్ ప్రకటించాలని ఆయన కోరారు. ‘ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ ఏర్పాటు చేయండి, మూడు,నాలుగు నెలల వ్యవధిలో ఆ కమిటీ తన సిఫార్సులను, నివేదికను సమర్పించేవిధంగా చూడండి’ అని ఆయన డిమాండ్ చేశారు. “దేశంలో అనూహ్యంగా నిరుద్యోగం పెరిగిపోయింది, ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి గణాంకాలు సమర్పించాల్సిన అవసరం లేదు,ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నవన్నీ కాకిలెక్కలే, ఈ రోజు దేశం లో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది, రోజు రోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు” అని బినోయ్ విశ్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల గురించి చెబుతున్న గణాంకాలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “అనేక లక్షలమంది ప్రజలు ఈ రోజు నిరుద్యోగులుగా మారిపోతున్నారు, కరోనా మహమ్మారి విజృంభించినప్పటినుండీ ఈ పరిస్థితి ఏర్పడింది, ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని చెబుతున్నప్పటికీ నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదేతప్ప తగ్గడం లేదు, కొనుగోలు శక్తి పెరగలేదు, డిమాండ్ గిరాకీ దిగువస్థాయిలో వృద్ధి చెందలేదు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గురించి ఘనంగా ప్రచారం చేసుకుంటున్నాం, “ఇలాంటి అమృతకాలం”లో లక్షలాదిమంది దేశ ప్రజలు,బహుశా ఈ సంఖ్య కోట్లలో ఉండవచ్చు…వారంతా తీవ్రమైన కష్టాల్లో బతుకుతున్నారు, వారి జీవన పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి” అని బినోయ్ విశ్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఒక ప్రణాళికతో ముందుకు రావాలని, వారికి మద్దతుగా ఉండి వారి జీవితాలు నిలబెట్టాలని ఆయన కోరారు. “కరోనా బారినపడిన ప్రజల సంఖ్య పెరుగుతోంది,వారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది, ఈ ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నా, వారికి అండగా నిలబడటానికి ఒక ప్రణాళిక రూపొందించండి,నిరుద్యోగ కేలండర్ ప్రకటించండి, వారు బతకడానికి, నిలదొక్కుకోవడానికి ఆధారం కల్పిచండి, అందుకోసం ఒక భూమికను తయారు చేయండి,వారిని వేతన వ్యవస్థను సమకూర్చండి” అని బినోయ్ విశ్వం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదిలాబాద్ సిసిఐని పునఃప్రారంభించాలి
కాగా టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు కె.కేశవరావు రాజ్యసభలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్‌జిల్లాలోని 1575 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్‌కు 300 కి.మీ దూరంలో ఉన్న ఈ సిసిఐ 1984లో ప్రభుత్వ అధీన సంస్థ హోదాలో సిమెంటు ఉత్పత్తి ప్రారంభించి,1998 నవంబరు 5 వరకు పనిచేసింది. ఆ తరువాత మూతపడింది. సంవత్సరానికి నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని స్థాపించారు. ఒక కిలోమీటరు సమీపంలోనే 2,75 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా సున్నపురాయి గనులు కూడా ఉన్నాయి. దేశం సిమెంటు ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వరంగంలో ఈ సిసిఐని స్థాపించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వహయాంలో ఈ కర్మాగారం మూతపడింది. వామపక్షాలు దీనిపై ఎన్నో ఆందోళనలు చేశాయి. సిసిఐని తెరిపించాలని కేంద్రాన్ని సిపిఐ డిమాండ్ చేస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం దీని పునరుద్ధరణకు డిమాండ్ చేస్తోంది.
తమిళ మత్స్యకారులకు రక్షణ ఇవ్వండి
కచ్చాతీవు ఐలాండ్‌ను వెనక్కు తీసుకోండి
అనంతరం ఎఐఎడిఎంకె సీనియర్ నాయకుడు ఎం.థంబిదురై కూడా రాజ్యసభ శూన్యగంటలో మాట్లాడుతూ, కచ్చాతీవు ఐలాండ్ సమస్యను ప్రస్తావించారు. తమిళనాడు మత్స్యకారుల సమస్యల పరిష్కారం కావాలంటే కచ్చాతీవు సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 1974లో జరిగిన భారత్ సముద్ర ఒప్పందం ప్రకారం కచ్చాతీవు ఐలాండ్‌ను ఏకపక్షంగా శ్రీలంకకు ఇచ్చివేయడంవల్ల తమిళనాడు మత్స్యకారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమిళనాడు జాలరుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. భారత మత్స్యకారుల పడవలపై శ్రీలంక నౌకాదళం కాల్పులు జరుపుతోందని,దానివల్ల తమిళనాడు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నారని, తరచు గాయాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ మత్స్యకారుల బోట్లను శ్రీలంక నౌకాదళం స్వాధీనం చేసుకుంటోందని,వారి వలలను కూడా లాగేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో మన మత్స్యకారులను అతిదారుణంగా చావబాదుతున్నారని, వారిని అక్రమంగా శ్రీలంక జైళ్ళలో బంధిస్తున్నారని, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, తమిళ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని థంబిదురై డిమాండ్ చేశారు. శ్రీలంక ప్రభుత్వం ఏకపక్షంగా భారత జాలరులకున్న సంప్రదాయ హక్కులు లాగేసుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంవల్ల ద్వైపాక్షిక నిబంధనలే లేకుండాపోయాయన్నారు. ‘భారత్ మధ్య జరిగిన సముద్ర ఒప్పందాన్ని తిరగదోడాలి, కచ్చాతీవును వెనక్కు తీసుకోవాలి, కచ్చాతీవు గతంలో భారత్‌లో అంతర్భాగంగా ఉండేది, అది తిరిగి భారత్‌కే చెందాలి,ఈ ఐలాండ్‌ను అనవసరంగా శ్రీలంకకు ఇచ్చేశారు, ఇది ఏకపక్ష నిర్ణయం, దీన్ని వెనక్కు తీసుకోవడానికి ఇదే సరైన తరుణం’ అని థంబిదురై డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.