జనజాతర సభకు భారీగా జనసమీకరణ
కాంగ్రెస్ నేతలకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
తుక్కుగూడలో మంత్రులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన టిపిసిసి చీఫ్
ప్రజాపక్షం/హైదరాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసే ‘కాంగ్రెస్ జన జాతర సభ’కు భారీగా జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ నాయకులను టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దేశమంతా మనవైపు చూస్తుందని , కాబట్టి సభ కూడా అదే తరహాలో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ జరిగే తక్కుగూడలోని రాజీవ్‌గాంధీ ప్రాంగణాన్ని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. మైదానమంతా కలియదిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమి చేయాలో చెప్పడంతో పాటు లోటుపాట్లు ఉన్న చోట్ల మార్పులను కూడా సూచించారు. ఎండలు బాగా ఉన్నందున మంచినీళ్ళు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, మహిళలు కూర్చునేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వారికి తప్పనిసరిగా కుర్చీలు ఉండాలని చెప్పారు. వెనుకకనపడేవారికి భారీ ఎల్ఇడి స్క్రీన్లు పెద్ద ఎత్తున పెట్టాలని, ప్రసంగాలు స్పష్టంగా ఉం డేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారంలో ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, 17 లోక్‌సభ స్థానాల ఇన్ఛార్జ్లు, ఇప్పటి వరకు ఖరారైన 14 మంది ఎంపి అభ్యర్థులతో బహిరంగ సభకు జనసమీకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో శాసనసభ ఎన్నికలకు ముందు ఇదే తుక్కుగూడ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ఆరు గ్యారెంటీలను సోనియాగాంధీ ప్రకటించారని, అది కాంగ్రెస్ గెలుపునకు ఎంతో ఉపయోగపడిందన్నారు. అలాగే ఈ నెల 6న జరిగే జనజాతర సభలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పాంచ్ న్యాయ్ పథకాలను, మ్యానిఫెస్టోను ఎఐసిసి అధ్యక్షులు, మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విడుదల చేస్తారని తెలిపారు. ఈ సభకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. మండల స్థాయి నాయకులను సమన్వయం చేసుకుంటూ కింది స్థాయి ప్రజలకు సభ ఉద్దేశ్యాన్ని వివరించి, తీసుకురావాలని సూచించారు.
కనీవిని ఎరుగని రీతిలో సభ : శ్రీధర్‌బాబు
రాజీవ్ గాంధీ ప్రాంగణంలో పెద్ద స్థాయిలో బహిరంగ సభ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సిఎం సమీక్ష అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమావేశ వివరాలను వెల్లడించారు. ఇండియా బ్లాక్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని, యావత్తు రాష్ట్రం నుండి లక్షలాది మంది కాంగ్రెస్ జన జాతర సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సభలోనే దేశానికి సంబంధించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల ముందు పెడతామన్నారు. రానున్న 48 గంటల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మండలస్థాయి నాయకులను సంప్రదించి సభ ఉద్దేశ్యాన్ని తెలియజేయాలని అన్నారు.
ప్రజలే తాట తీస్తారు
తాట తీస్తానన్న కెటిఆర్ మాటలను మీడియా ప్రస్తావించగా, ప్రజలు ఎవరి తాట తీసారో చూశామని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మరో సారి ఎవరి తాట తీస్తారో చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి కొండా సురేఖకు కెటిఆర్ పంపిన లీగల్ నోటీసుపై చట్టపరంగా, న్యాయపరంగా ఏమి సమాధానం చెప్పాలో, ఎలా ఎదుర్కోవాలో అలా చేస్తామని అన్నారు. చేనేత కార్మికులకు రూ.400 కోట్ల గురించి కెటిఆర్ లేఖ రాయడం విడ్డూరంగా ఉన్నదని, ఆ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయానికి సంబంధించినవేనని చెప్పారు.
పదేళ్ళలో కెటిఆర్ ఎందుకు విచారణ చేయలేదుః పొన్నం
ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తనది, సహచర ఎంపిలవి ఫోన్లు ట్యాప్ చేశారని తాను ఆరపించినట్లు కెటిఆర్ అన్నారని, దానికి కట్టుబడి ఉన్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ తరువాత వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉన్నదని, అందులో కెటిఆర్ మంత్రిగా ఉన్నారని, ఆయన తన సహచర ఉద్యమకారులైన మా ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను, స్వంత పార్టీ వారిని అణిచివేసేందుకు , వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ట్యాపింగ్ చేసారని మండిపడ్డారు. అది వదిలేసి గతంలో పొన్నం ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయాలని కెటిఆర్ అనడం హాస్యాస్పదమన్నారు.