బిజెపిపై రాహుల్‌గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై రాహుల్ తొలిసారి స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘భారతలోని సిక్కు సోదరసోదరీమణులను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడూ… తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశం భారత్ కాకూడదా? అమెరికా పర్యటనలో సిక్కులపై నేను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోంది. ఎప్పటిలాగే అసత్యాలు ప్రచారం చేస్తోంది. నిజాన్ని సహించలేకే నా నోరు మూయించాలనుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ భారత్‌లో ఉన్నాయి. దేశ విలువల విషయంలో నేను ఎల్లప్పుడూ గొంతెత్తుతాను’ అని రాహుల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
పనివిధానాలపై పోరాడుతా
పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో (%జుతీఅ్ అ ్శీఅ అఱ%) పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మతిపై రాహుల్‌గాంధీ స్పందించారు. శనివారం ఆయన బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. పని విధానాలను మెరుగుపర్చే అంశంపై తాను పోరాడుతానని హామీ ఇచ్చారు. కేరళలోని కోచిలో గల అన్నా సెబాస్టియన్ నివాసానికి నేడు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన రాహుల్ గాంధీకి వీడియోకాల్ చేయగా… బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. బిడ్డను కోల్పోయిన బాధలోనూ వారు ఆఫీసుల్లో పని పరిస్థితులు మెరుగుపడాలని గళమెత్తడాన్ని అభినందించారు. కోట్లాది మంది వత్తి నిపుణుల ప్రయోజనాల కోసం వారు ధైర్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఈ అంశంపై తాను కూడా శాయశక్తులా పోరాడుతానని హామీ ఇచ్చారు. అంతేగాక.. అన్నా జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా వత్తి నిపుణుల కోసం ఓ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఏఐపీసీ ఛైర్మన్‌కు రాహుల్ సూచించారు. ఆయన సూచన మేరకు… పనిఒత్తిడి, పని సంస్కృతికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం కోసం త్వరలోనే ఓ హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేయనున్నట్లు ఏఐపీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కర్నాటక బీజేపీ మండిపడింది. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘కొన్ని వర్గాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో పాటు రిజర్వేషన్లు తొలగిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రతిపక్ష నాయకుడు విభజన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలో ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు తొలిగించే కుట్రలో రాహుల్ విజయం సాధించలేరని విమర్శించారు.