ఉత్తరప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో గాలి దుమారం
దుమ్ము తుపానుకు 26 మంది బలి, 50 మందికిపైగా గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో శు క్రవారం వచ్చిన తీవ్ర దుమ్ము తుపాను, పిడుగులకు 26 మంది చనిపోగా, ఇళ్లు, గోడలు, చెట్లు కూలిపోవడంతో 57 మందికి గాయాలయ్యాయి. అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. కనీవిని ఎరుగని రీతిలో గాలి దుమారం రేగింది. మైన్‌పుర్‌లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. గురువారం రాత్రే గో డ కూలడం, పిడుగులు పడిన వేర్వేరు సంఘటనల్లో ఆరుగురు చనిపోయారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ తెలిపారు. జిల్లాలో 49 మందికి గా యాలయ్యాయని, చెట్లు కూలి రహదారులపై పడటంతో రాష్ట్ర హైవే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ‘మైన్‌పుర్‌లో ఆరుగురు చనిపోయారు. ముగ్గురు ఇటాలో, మరో ముగ్గురు కస్‌గంజ్‌లో చనిపోయారు. ఫరూఖాబాద్, బారాబంకీల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. మొరాదాబాద్, బదౌన్, పిల్‌భిత్, మథుర, కన్నౌజ్, సంభల్, ఘాజీయాబాద్, అమ్రోహ, మహోబా ఒక్కొక్కరు చొప్పున దుమ్ముతుపాను, పిడుగులకు మరణించారు’ అని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ తెలిపారు. గరువారం సాయంత్రం నుంచే దుమ్ముతుపాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుందని అధికారిక ప్రకటన పేర్కొంది. దానివల్ల గోడలు కూలడం, చెట్లు పడిపోవడం జరిగాయని సమాచారం. ఈ ఘటనల్లో 31 పశువులు చనిపోగా, 16 ఇళ్లు కూలిపోయాయని అధికారులు చెప్పారు. ‘ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లక్నో సహా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధిత ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. ఆయా జిల్లా మంత్రులను కూడా ఆదేశించారు’ అని ప్రధాన కార్యదర్శి(ఇన్‌ఫర్మేషన్) అవనీశ్ అవస్తీ చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 4లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్య మంత్రి ప్రకటించారు. పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా మెజిస్ట్రేట్లకు చెప్పారని ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. దీనికి ముందు బాధితులను ఆదుకునేందుకు తగినంత సాయంతో ప్రభుత్వం ముందుకు రావాలని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు.