రజతంతో సరిపెట్టుకు జూనియర్ ఛాంపియన్
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్
రష్యా: తొలి నుంచి సంచలనంగా మారిన భారత రెజ్లర్ దీపక్‌పునియా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. 86 కేజీల విభాగంలో స్విట్జర్‌లాండ్ రెజ్లర్ రీచ్‌ముత్‌పై 8-2 తేడాతో శనివారం సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన పునియా ఫైనల్ మ్యాచ్‌కు ముందు తప్పుకున్నాడు. ఆదివారం ఇరాన్‌కు చెందిన రియో ఒలింపిక్స్ ఛాంపియన్ హసన్ యజ్దానీతో తలపడాల్సి ఉండగా ఎడమకాలి గాయం కారణంగా తాను ఆడట్లేదని పునియా పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించాడు. గత మ్యాచ్‌ల్లో తన ఎడమకాలికి గాయమైందని, ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్స్ ఆడితే బరువు మోయలేనని, అది తనకు మంచిదికాదని వెల్లడించాడు. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవడం బాధగా ఉన్నా తాను చేయగలిగిందేమీ లేదని పునియా వాపోయాడు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో అతడు క్వార్టర్స్‌లో కొలంబియా రెజ్లర్ కార్లోస్ మెండిస్‌ను 7-6తో ఓడించాడు. ఫైనల్స్‌లో తలపడనందున పునియా సెమీస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బజ్‌రంగ్ పునియా, వినేశ్‌ఫొగాట్, రవి దూహియాలతో పాటు దీపక్ పునియా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. గతేడాది జూనియర్ ఛాంపియన్‌షిప్ గెలుపొందిన అతడు ఈ సారి సీనియర్లని ఓడించి ఫైనల్ చేరడం విశేషం. ఇదిలా ఉండగా 2010లో మాస్కోలో నిర్వహించిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున సుశీల్‌కుమార్ 66 కేజీల విభాగంలో స్వర్ణపతకం సాధించాడు.
దీపక్‌పునియా ఔట్
RELATED ARTICLES