ట్యాంక్‌బండ్‌వైపు దూసుకెళ్లిన అఖిలపక్ష నేతలు
ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థులకు నివాళి
అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్: పోలీసుల దిగ్బంధాన్ని ఛేదించుకొని అఖిలపక్ష నాయకులు ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తులు వెలిగించారు. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థులకు నివాళి అర్పించేందుకు అఖిలపక్షం పిలుపులో భాగంగా ట్యాంక్‌బండ్‌కు ఇరువైపుల గురువారం భారీగా పోలీసులను మోహరించారు. అటు లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం, ఇటు మారియెట్ హోటల్ వద్ద ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే వారిని అరెస్టు చేశారు. అయినప్పటికీ పోలీసులను దాటుకొని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోటూరి మానవతారాయ్, వినోద్‌రెడ్డిలు గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ట్యాంక్‌బండ్‌పై చేరుకున్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు కొవ్వొత్తులు పట్టుకొని ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించారు. వెంటనే ఎక్కడికక్కడ మొహరించిన పోలీసులు దూసుకొచ్చి వారిని అరెస్టు చేశారు. చాడ వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తదితరులను ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు అంబేడ్కర్ విగ్రహం వద్ద టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టిపిసిసి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, సునీతారావు, సిపిఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహలను పోలీసులు అరెస్టు చేశారు.
అప్రకటిత ఎమర్జెన్సీ : చాడ
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం నెలకొన్నదని చాడ వెంకటరెడ్డి అన్నారు. కనీసం నివాళులర్పించేందుకు కూడా ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉన్నదని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఇప్పటివరకు స్పందించని ప్రభుత్వం తమ ఉద్యమాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం దారుణమన్నారు.