మహారాష్ట్ర లసల్‌గాన్ మార్కెట్‌లో కిలోకు రూ. 30 దిగువకు పడిపోయిన ధర
ముంబయి : ప్రభుత్వ చర్యలతో ఉల్లిధరలు తగ్గుముఖం పట్టాయి. వంటింటి దినుసు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే. అదే విధంగా వ్యాపారులు చేస్తున్న నిల్వలపై కూడా పరిమితి విధించిన సంగతి విదితమే. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లిగడ్డ మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లసల్‌గాన్‌లో కిలోకు రూ. 30 దిగువకు ధరలు పడిపోయాయి. నాశిక్ జిల్లాలో ఉన్న ఈ మార్కెట్‌లో సెప్టెంబర్ మాసం మధ్యలో కిలోకి అత్యధికంగా 51 రూపాయల ధర పలకగా, ప్రస్తుతం ఆ ధరలు దిగివస్తున్నట్లు నేషనల్ హార్టీకల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్) గణాంకాల ద్వారా వెల్లడయింది. దేశవ్యాప్తంగా లాసల్‌గాన్ మండిలోనే ధరలు నిర్ధారణ అవుతాయి. ఈ మార్కెట్‌లో ధరల్లో ఏవైనా హెచ్చుతగ్గులు అయితే ఆ ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లో పడుతుంది. కాగా, లసల్‌గాన్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలో గురువారం హోల్‌సేల్‌గా ఉల్లిధర సరాసరి కిలోకు రూ. 26 పలకగా, అత్యధికంగా రూ. 30.20, అత్యల్పంగా రూ. 15 పలికింది. ఉల్లిని పండించే రాష్ట్రాలు ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురియడంతో వరదలు పోటెత్తాయి.
దిగొస్తున్న ఉల్లిధరలు
RELATED ARTICLES