ప్రజాపక్షం/ వరంగల్ బ్యూరో ; మేడారం మహాజాతరకు భక్తజనం తరులుతుండడంతో దా రులన్నీ మేడారం వైపే చూస్తున్నాయి. గ్రామాలు, పట్టణా లు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జనం మేడారానికి వాహనాలలో తరలి వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనారణ్యంగా మారుతున్నది. రోజురోజుకు భక్త జనం పెరుగుతుండడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. మహాజాతరలో మొదటి ఘట్టానికి సమయం దగ్గరపడుతున్నది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుండి సమ్మక్క భర్త పగిడిద్దరాజును మంగళవారం తీసుకురానున్నారు. అలాగే కన్నెపల్లి నుండి బుధవారం సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది. ఆమెతో పాటు సమ్మక్క చెల్లి నాగులమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజులు, సమ్మక్క కొడుకు జంపన్నలు వేర్వేరు ప్రాంతాల నుండి అదే సమయానికి గద్దెలకు చేరుకోనున్నారు. ఈ ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేస్తున్నది. పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయపద్ధతిలోనే ఈ ఘట్టాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు వారాలుగా ఆదివాసీ పూజారులు నిష్టతతో ఎవరినీ కలవకుండా ఆ తల్లుల మహిమానిత్వంలోనే ఉండిపోయారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తల్లి సమ్మక్క మినహా మిగిలిన కుటుంబసభ్యులందరిని ముస్తాబు చేసి తోడుకొని రావడానికి ఆ ప్రాంతాల్లోని గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి మేడారానికి పయనం కానున్నారు. సారలమ్మ మాత్రం బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి తన ప్రయాణాన్ని మేడారానికి మొదలు పెడుతుంది. సారలమ్మ వస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు భారీ భద్రతా వలయాన్ని పోలీస్ యంత్రాంగం చేపడుతుంది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులలో పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతిరాథోడ్‌లు ప్రభుత్వం నుండి ఇన్‌చార్జ్ మంత్రులుగా జాతరలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జాతర మొదటి ఘట్టంలో సారలమ్మ వస్తున్న సమయంలో ఎలాంటి అపశ్రుతి జరగకుండా ఉండేందుకు ఇద్దరు మంత్రుల నేతృత్వంలో అన్నిశాఖలను సమన్వయం చేసుకొని తల్లులను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతర కేంద్రంలో ఇప్పటికే విఐపి, ఇతర వ్యక్తులను విఐపి ద్వారం ద్వారా దర్శనానికి అనుమతించకుండా నిలిపివేశారు. ఇప్పటికే జాతరలో ఇద్దరు మంత్రులుండగా నేటి నుండి దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర మంత్రులు కూడా జాతరలోనే ఉండనున్నారు. జాతరకు భక్తులు భారీగా వస్తున్నందున రవాణ సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా పోలీస్ యంత్రాంగాన్ని అన్ని రూట్లలోఅప్రమత్తం చేసారు. ప్రభుత్వం టూరిజం శాఖా ఆధ్వర్యంలో ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా బక్తులను చేరవేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది.
దారులన్నీ మేడారం వైపే
RELATED ARTICLES