రుణాలిచ్చే ‘యాప్’ దొంగలు దొరికారు
ఆ ‘మైక్రో ఫైనాన్స్’లో ఇండోనేషియా, చైనా వ్యక్తులు
11 మంది ముఖ్యుల అరెస్ట్
గూగుల్ నుంచి ఆ యాప్‌లను తొలగించాలని లేఖ
షార్ట్‌కట్స్ రుణాలు వద్దు: సిపి అంజనీకుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్ మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెందిన 11 మంది ముఖ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశా రు. వారి వద్ద నుంచి 700 వరకు ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌బిఐ అనుమతి లేకుండా కొనసాగుతున్న పలు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఇండోనేషియా, చైనాకు చెంది న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. అలాగే ఆర్‌బిఐ అనుమతి లేని సుమారు 63 యాప్స్‌ను గుగూల్ నుంచి తొలగించాలని ఆ సంస్థకు లేఖ రాశారు. అలాగే రుణాల రూపంలో వస్తున్న నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల మోసాలపై సైబర్ సెల్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. అదనపు కమిషనర్ షికాగోయల్, జాయింట్ సిపి అవినాశ్ మహంతితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం హర్యానకు చెందిన హెచ్.ఆర్ మేనేజర్ బిందురాణి,జ్యోతిమల్లిక్, గుర్గవ్‌కు చెందిన మేనేజర్ అమిత్, న్యూఢిల్లీకి చెందిన రమన్‌దీప్ సింగ్, డైరెక్టర్ ప్రభాకర్ దంగ్‌వాల్, హైదరాబాద్‌కు చెం దిన సెంటర్ హెడ్ మధుబాబు, అసిస్టెంట్ మేనేజర్ మనోజ్‌కుమార్, అడ్మిన్ మహేశ్ కుమార్, తరుణ్, టెక్నికల్ హెడ్ తరుణ్, హెచ్‌ఆర్ మేనేజర్ జీవన్ జ్యోతిలను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెందిన వివరాలను అదనపు కమిషనర్ షికాగోయల్, జాయింట్ సిపి అవినాశ్ మహంతితో కలిసి అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 16 మైక్రో సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఉద్యోగ్ విహార్, గుర్గావ్, హైదరాబాద్‌లో దాడులు నిర్వహించామన్నారు. ఆర్‌బిఐ అనుమతి లేకుండా కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొనసాగుతున్నాయన్నారు. రుణాలు తీసుకున్న వినియోగదారులను సంస్థలు వేదిస్తున్నాయని, వారి వేధింపులకు తాళలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని వివరించారు. వేధించే సంస్థల పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బెంగళూరు వేదికగా రిజిస్ట్రేషన్ జరిగిన రెండు సంస్థలను గుర్తించామని, లియోఫాంగ్ టెక్నాలజీ సంస్థకు చెందిన జీవన్ జ్యోతి, సెల్వరాజ్ సింగి, పిన్‌ప్రింట్ సంస్థకు చెందిన రవికుమార్ మంగళ, వెంకట్‌పై కేసు నమోదు చేశామన్నారు. హైదరాబాద్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థ తరపున 600 టెలీకాలర్లు పనిచేస్తున్నారని, గుర్గవ్‌లో 500 మంది టెలికాలర్లు పని చేస్తున్నారని వివరించారు.
షార్ట్‌కట్స్ వద్దు : అంజనీకుమార్
షార్ట్‌కట్ పద్ధతిలో ఒక ఫోన్ కాల్ రుణాల ట్రాప్‌లో పడొద్దని అంజనీకుమార్ సూచించారు. ఇలాంటి సంస్థలకు సంబంధించి ఏదైనా అనుమానాలు వస్తే తమ సైబర్ స్టేషన్, లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. గుగుల్ ప్లే నుంచి డౌన్‌లోడ్ చేసే క్రమంలో అన్నింటికీ అవును అని గుర్తు లు పెట్టకుండా జాగ్రత్తగా చదవాలన్నారు. షికాగోయాల్ మాట్లాడుతూ 7 నుంచి 15 రోజుల్లో 20 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం కనీసం 60 రోజుల్లోపు రుణాలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అవినాష్ మహంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు 80 డిజిటల్ వాలెట్స్‌ని సీజ్ చేశామన్నారు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో ఆరా తీయాలన్నారు.
దా‘రుణ’‘యాపా’రం
RELATED ARTICLES