HomeNewsTelanganaదాడులెన్ని జరిగినా పాలస్తీనాలోనే...

దాడులెన్ని జరిగినా పాలస్తీనాలోనే…

అక్కడే మరణిస్తామని ప్రజలు దృఢ నిర్ణయంతో ఉన్నారు
భారతదేశంలో పాలస్తీనా రాయబారి అద్నాన్‌ మహ్మద్‌ జబేర్‌ అబుల్‌ హయెజా
సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం ‘పాలస్తీనా సంఘీభావ సభ’
ప్రజాపక్షం/ హైదరాబాద్‌
ఇజ్రాయెల్‌ ఎన్ని దాడులు చేసినా, తామంతా పాలస్తీనా భూభాగంలోనే జీవిస్తామని, అక్కడే మరణిస్తామని పాలస్తీనా ప్రజలు దృఢ నిర్ణయం తో ఉన్నారని భారతదేశంలో పాలస్తీనా రాయబారి అద్నాన్‌ మహ్మద్‌ జబేర్‌ అబుల్‌ హయెజా అన్నారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమస్‌ చేసి న దాడిని, ఉగ్రవాద చర్య అంటున్నారని, అసలు అంతకుముందు గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల నేపథ్యంలో చూస్తే వాస్తవాలు అర్థమవుతాయన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యం లో ఆదివారం ‘పాలస్తీనా సంఘీభావ సభ’ జరిగింది. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాలస్తీనా రాయబారి అద్నాన్‌ మహ్మ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు పల్లభ్‌ సేన్‌ గుప్తా, డాక్టర్‌ కె.నారాయణ, రామకృష్ణ పాండ, జాతీయ కార్యవర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి, అనీ రాజా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్మపద్మ, ఇటి నర్సింహ్మ, విఎస్‌ బోస్‌, బాల నర్సింహ్మ, కలవేణి శంకర్‌, టి. శ్రీనివాస్‌రావులు హాజరయ్యారు. సభనుద్దేశించి పాలస్తీనా రాయబారి అద్నాన్‌ మహ్మద్‌ జబేర్‌ అబుల్‌ హయెజా ప్రసంగిస్తూ అక్టోబర్‌ 7న అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేశారని, అది దురాక్రమణ, ఉగ్రవాద చర్య అని చాలా మంది భావిస్తున్నారని, పాలస్తీనా చరిత్ర తెలిసిన వారికి వాస్తవాలు అర్థమవుతాయన్నారు. ఎవరైనా ఆక్రమింపబడిన వారు ఉగ్రవాదులు కారని, ఆక్రమణదారులే అసలైన ఉగ్రవాదులు అని చెప్పారు. 75 ఏళ్ళ హత్య లు, హింస, 10 లక్షలమందికి పైగా అరెస్టులు, వెస్ట్‌ బ్యాంక్‌లో నివాసితులను వెళ్లగొట్టడం, ఓస్లో ఒప్పందం ఉల్లంఘణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. గాజా స్ట్రిప్‌లో 23 లక్షల మంది నివసిస్తున్నారని, అందులో 75 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారని చెప్పారు. హమాస్‌ దాడి జరిగిన అక్టోబర్‌ 7వ తేదీకి ముందు గాజా స్ట్రిప్‌లో 260 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ చంపేసిందని, 75 ఏళ్ళ చరిత్రలో ప్రస్తుతం ఉన్నది అత్యంత అతివాద ప్రభుత్వమని చెప్పారు. ప్రతి రోజు తూర్పు జెరుసలేం ఇతర పాలస్తీనా ప్రాంతాల్లో అనేక మందిని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేందుకు బలవంతం చేస్తున్నారని విమర్శించారు. ఇజ్రాయెల్‌ దురాక్రమణ, మారణ హోమం లక్ష్యమేమిటంటే పాలస్తీనా నుండి గాజా నుండి ఈజిప్టుకు, వెస్ట్‌ బ్యాంక్‌ నుండి జోర్డాన్‌ దేశాలకు తరిమివేయడమేనని వివరించారు. అక్టోబర్‌ 7 తరువాత 120 రోజుల్లో గాజా ప్రాంతంలో 27వేల మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపేశాయని, అందులో 11 వేల మంది పిల్లలు, 8వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారని చెప్పారు. గాజాను ధ్వంసం చేశారని, 66 వేల టన్నుల పేలుడు పదార్ధాలను ప్రయోగించారని తెలిపారు. ప్రస్తుతం 11700 మందిని ఖైదు చేశారని అన్నారు. ఇప్పటికీ 122 మంది జర్నలిస్టులను చంపేశారని అన్నారు. అక్టోబర్‌ 7కు ముంది 5వేల మందిని అరెస్టు చేస్తే, తరువాత 6,700 మందిని అరెస్టు చేసారని, అందరూ వెస్ట్‌బ్యాంక్‌లో ఖైదు చేయబడ్డారని తెలిపారు. ఐక్య రాజ్య సమితి తీర్మానం నెంబర్‌ 194 అత్యంత ముఖ్యమైనదని, దాని ప్రకారం పాలస్తీనీయులకు అక్కడే నివసించే హక్కు ఉన్నదన్నారు. ఐక్యరాజ్య సంస్థ ఆధ్వర్యంలో పాలస్తీనా శరణార్థులకు, పేదలకు సాయం చేసే ఒనుర్వా సంస్థకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశారని వెల్లడించారు. ప్రపంచమంతా కాల్పుల విరమణ చేయాలని కోరతున్నప్పటికీ ఇజ్రాయెల్‌ పెడచెవిన పెడుతున్నదన్నారు. అయినప్పటికీ పాలస్తీనా ప్రజలు మాతృభూమిలోనే జీవిస్తామని, ఇక్కడే మరణిస్తామని నిర్ణయం తీసుకున్నారని అద్నాన్‌ మహ్మద్‌ స్పష్టం చేశారు.
రెండు దేశాల పరిష్కారానికి అంగీకరించాలి: డి.రాజా
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలోని అలీన విదేశాంగ విధానం నుండి వైదొలిగి సామ్రాజ్యవాద, అమెరికా అనుకూల విధానాన్ని అవలంబిస్తుందని డి.రాజా విమర్శించారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, వారు ఎలాంటి వైఖరి తీసుకున్నా సిపిఐ మాత్రం పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్‌లో పిల్లలకు, మహిళలకు తిండి, మందులు లేవని, ఈ పరిస్థితులలో యుద్ధం ఆగిపోవాలని, ఇందుకు రాజకీయ పరిష్కారం కావాలని, ఇజ్రాయెల్‌ రెండు దేశాల పరిష్కారానికి అంగీకరించాలన్నారు. ఇజ్రాయెల్‌ ఉండొద్దని పాలస్తీనా అనొద్దని, అలాగే పాలస్తీనా వద్దని ఇజ్రాయెల్‌ అనొద్దన్నారు. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో 23 లక్షల మందిని ఇజ్రాయెల్‌ నిరాశ్రయులను చేసిందని పల్లభ్‌ సేన్‌ గుప్తా అన్నారు. పాలస్తీనాకు కేవలం సిపిఐ మాత్రమే కాదని, మహాత్మాగాంధీ కూడా మద్దతు తెలిపారని, పాలస్తీనాకు స్వాతంత్రం వచ్చేంత వరకు భారతస్వాతంత్రం పూర్తి కాదని తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పాలస్తీనాకు సంఘీభావంగా తీర్మానంః పాలస్తీనాకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ హైదరాబాద్‌లోని సభలో తీర్మానం చేశారు. సభలో అప్పటికప్పుడు పాలస్తీనాకు సంఘీభావంగా సభికులు ఇచ్చిన రూ.50 వేల విరాళాన్ని పాలస్తీనా రాయబారికి డి.రాజా అందజేశారు. ‘పాలస్తీనా సంఘీభావ సభ’ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments