పట్టాలివ్వాలని పోడు రైతు పోరాట కమిటీ డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్ పోడు సాగు రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని, వారిపై వేధింపులను, దాడులను తక్షణమే ఆపాలని పోడు రైతు పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోడు సాగు రైతు సమస్యలపై అక్టోబర్ 5న తలపెట్టిన మహా రాస్తారోకోను జయప్రదం చేయాలని, పోడు రహదారులను అష్టదిగ్బంధం చేయాలని పిలుపునిచ్చింది. ‘అటవీ హక్కుల చట్టం,పెసా చట్టం అమలు చేయడంతో పాటు పోడు రైతులకు భూమిపై హక్కు కల్పించాలని’ డిమాండ్ చేస్తూ పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “పోడు రైతు పొలికేక, అఖిల పక్ష సదస్సు” సోమవారం జరిగింది. ఈ సదస్సుకు టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సీతక్క, సిపిఐ (ఎం.ఎల్. న్యూ డెమోక్రటిక్) రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌గౌడ్, సిపిఐ (ఎం.ఎల్. న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదరి సాధినేని వెంకటేశ్వర్ రావు, మాజీ ఎంపి మిరియం బాబురావు,మాజీ ఎంఎల్‌ఎ గుమ్మడి నర్సయ్యతో పాటు ప్రజా సంఘాలు, కార్మిక, వ్యవసాయ సంఘాల ప్రతినిధులు ఎఐకెఎస్‌సిసి కన్వీనర్లు పశ్యపద్మ(తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), అచ్యుతా రామారావు, టి.సాగర్, కన్నెగంటి రవి, రంగారెడ్డి, గిరిజిన సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐ (ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ) నాయకులు కె.గోవర్ధన్, తెలంగాణ రాష్ట్ర రైతు కార్మిక సంఘం నాయకులు కాంతయ్య, గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. అటవీ హక్కు చట్టంపై అవగాహనను కల్పించడంతో పాటు ‘రాస్తారోకో సన్నాహాక ’ సదస్సులను నిర్వహించి, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని పోడు రైతు పోరాట కమిటీ తెలిపింది.
పట్టాలెందుకు ఇవ్వడం లేదో సిఎం సమాధానం చెప్పాలి : కూనంనేని
రాజ్యాంగాన్ని సిఎం కెసిఆర్ ఎందుకు అమలు చేయడం లేదని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. 12 లక్షల ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారని, ఇది గిరిజన భూములా? కాదా, వారికి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదో సిఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన పోడు సాగు రాజ్యాంగానికి లోబడి, అటవీ హక్కుల చట్టం ప్రకారమే సాగవుతున్నప్పటికీ సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకుందో అర్థం కావడం లేదని, రాజ్యాంగ అంశంలో ఎలా జోక్యం చేసుకున్నారోనని అన్నారు. ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలు, పోరాటాలు అన్నీ భూముల కోసమేనని, రాజ్యాలు కూడా అందులో భాగమేనని వివరించారు. సిఎం కెసిఆర్‌కు నిజంగానే చాకలి ఐలమ్మపై గౌరవం, అభిమానం ఉంటే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.
అర్హులకు పట్టాలివ్వాలి: కోదండరామ్
ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మాట్లాడుతూ పోడు భూ సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు రైతు సమస్యలపై చేపడుతున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం అమలు చేసేలా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పోడు భూములపై ఆధారపడి, సాగు చేసుకుంటున్న వారిని ఆ భూముల నుంచి తప్పించే అధికారం ప్రభుత్వానికి లేదని, ఈ అంశం చట్టంలో స్పష్టంగా ఉన్నదని వివరించారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పర్యావరణం పేరుతో పొడుభూములను ప్రైవేట్ కేంపెనీలకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పోడు రైతు రాస్తా రోకో తరువాత పోడు రైతులను వేదించకుండా, కేసులు పెట్టకుండా సిఎం కెసిఆర్‌కు సరైన బుద్ధి చెప్పాలన్నారు. రాస్తారోకోను గేరిల్లా పద్ధతిలో నిర్వహించాలన్నారు. సీతక్క మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పాలనలో భూములన్నీ కొంతమంది చేతుల్లోకి పోతున్నాయన్నారు. అటవీశాఖ అధికారులు పోడు సాగు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఫామ్ హోజ్‌ల పేరుతో వేల ఎకరాలు ఆక్రమించుకుంటున్నారన్నారు. కెసిఆర్ పాలనలో కష్టపడిన వారికి కన్నీళ్లు పెద్దోళ్లకు లాభాలు దక్కుతున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రతిష్టను మోడీ వద్ద తాకట్టు పెట్టారు: కూనంనేని
తెలంగాణ పరువును, ప్రతిష్టను, గౌరవాన్ని సిఎం కెసిఆర్ ప్రధాని మోడీ వద్ద తాకట్టు పెట్టారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ గౌరవాన్ని తీసే హక్కు కెసిఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మోడీ వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తారని తాము ఉహించలేదన్నారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ రాజకీయ దక్షతను పాటించాలని సూచించారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ మల్లన్న యుద్ధం చేస్తున్నట్టు ఫోజులు కొడుతున్నారని, పంచ్ డైలాగులు కొడితే ఇక నుంచి సిఎం కెసిఆర్‌కు ‘తమ పంచ్’లు పడుతాయని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతిపక్షాలు తిడితే ఊరుకోబోమని మంత్రి కెటిఆర్ ప్రకటించారని, ఏడేళ్ల నుంచి ‘మీ అయ్యనే’(సిఎం కెసిఆర్) కమ్యూనిస్టు పార్టీలను, ప్రతిపక్షాలను తమ నోటికొచ్చినట్టు తిట్టారని చెప్పారు. ఇక నుంచి తాము కూడా ఊరుకునేది లేదని, కెసిఆర్, కెటిఆర్ తరహా కాదని, ప్రజల పద్ధతిలోనే తిడుతామని ఏం చేస్తారని ఆయన కెటిఆర్‌ను ప్రశ్నించారు.