బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.10 లక్షలు ఇవ్వాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
‘మండల్ కమిషన్ సిఫారసులు- ప్రభుత్వాల వైఖరి’పై రౌండ్‌టేబుల్
ప్రజాపక్షం/హైదరాబాద్ దళిత బంధు మాదిరిగానే బిసిలకు రూ.10 లక్షలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఎస్‌సిలకు దళిత బంధు ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించడంతో అలాంటి స్కీమును ఎస్‌టిలు, బిసిలు కూడా అడుగుతున్నారన్నారు. బిసిలకు కూడా రూ. 10 లక్షలు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఇవ్వాలన్నారు. బి.సి. హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘మండల్ కమిషన్ సిఫారసులు వైఖరి’ అనే అంశంపై హైదరాబాద్‌లోని బిసి సాధికారత భవన్‌లో రౌండ్ టెబుల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి చాడ వెంకట్‌రెడ్డి, బి.సి. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, బి.సి హక్కుల సాధన సమితి రాష్ట్ర ఇన్‌చార్జి ఎన్.బాల మల్లేష్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్, బి.సి హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు శ్ర వణ్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రధా న కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాలకొండ కాంతయ్య, బి.సి.సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యాక్షుడు గుజ్జ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్బంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు, సామాజిక న్యాయం ఎక్కడా అమలు జరగలేదన్నారు. నరేంద్ర మోడీ తాను బిసి అని, చాయ్ వాలా అంటూ ప్రధాని అయ్యారని, కానీ బిసిలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నల్ల డబ్బు తీసుకొస్తానని, పేదల బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తానని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలతో గద్దెనెక్కిన మోడీ… ఏ మేరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. బి.సి. సంఘాలు, బిసి సంస్థలు ఒక వేదికపైకి వచ్చి, ఐక్య ఉద్యమాలు చేస్తే మద్దతు ఇస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని అమలు చేయకుండా ప్రభుత్వాలు చొద్యం చూస్తున్నాయని ఆరోపించారు. మండల్ కమిషన్ సిఫారసులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మండల కమిషన్ ఇచ్చే సిఫారసుల అమలు కోసం మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితులను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు సబ్ ప్లాన్‌లు ఉన్నాయని, బిసిలకు ఎందుకు సబ్ ప్లాన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బిసి రుణాల కోసం సుమారు 7 లక్షల వరకు దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయన్నారు. బిసిలు బతుకొద్దా?, దేశంలో వారికి హక్కులు లేవా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను కల్పించాలన్నారు. దేశ వ్యాప్తంగా బిసిలకు ఒక వేదిక ఏర్పాటు చేసి, హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని, ఇందుకు సిపిఐ సంపూర్ణంగా మద్దతునిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించుకోవాలన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ 40 సిఫారసులు చేసిందన్నారు. ఈ సిఫారసులను అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్రంలో బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్‌లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా బిసిలకు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తుందని వివరించారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలు కోసం పార్లమెంట్‌లో, బయట పోరాటం చేయాలని తెలిపారు. సిఎం కెసిఆర్ బి.సి బంధు పథకం ప్రవేశపెట్టి, రూ.10 లక్షలు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసిలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని, బిసిల డిమాండ్‌లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పారు. బాల మల్లేష్ మాట్లాడుతూ దేశంలో 52 శాతం ఉన్న బిసిలకు మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. బిసిలకు రుణాలు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. బిసిలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాలకు శ్రీకారం చుడతమన్నారు. శ్రవణ్ మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, బిసి బంధు పథకం పెట్టి, రూ10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్‌లకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలతో బి.సి.హక్కుల సాధన సమితి నాయకులు ఆర్.కృష్ణ మూర్తి, బాత రాజు నర్సింహ, కిషన్, జె.లక్ష్మి, ప్రమిళ, సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు.