ఆరు నెలలకోసారి తెరపైకి
ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రూ.50 లక్షలు ఎవరివి…?
45 నెలలు గడుస్తున్నా తేల్చలేక పోతున్న వైనం
ప్రజాపక్షం/ హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో దర్యాప్తు తంతు ను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన రూ.50 లక్షల నగదు, ఎపి సిఎం చంద్రబాబు స్వర పరీక్ష నివేదిక ఈ రెండిటిపై కూడా ఇంత వరకు స్పష్టత రాలేదు. ఆరు నెలలకోసారి కేసును తెరపైకి తీసు కు వచ్చి హల్‌చల్ చేయడం ఆ తరువాత మరుగున పడేయడం దర్యాప్తు అధికారులకు తంతుగా మారింది. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రూ. 50 లక్షల నగదు ఎవరివి..? ఎక్కడి నుంచి వచ్చాయి..? అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు. ఎంఎల్‌సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేం నరేందర్‌రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్‌ఎ స్టిఫెన్‌సన్‌తో మాజీ ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డి, బిషప్ హర్రి సెబాస్టాన్, రుద్రా ఉదయ్‌సంహలు రూ.5 కోట్లు డీల్ కుదుర్చుకోవడం, ఈ క్రమంలోనే అడ్వాన్స్‌గా మే 31, 2015నాడు రూ.50 లక్షలు స్టిఫెన్‌సన్‌కు ఇస్తుండగా పైముగ్గురిని ఎసిబి అధికారులు కాపుకాసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎసిబి అధికారులు రేవంత్‌రెడ్డి వద్ద నుంచి రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు అనేది ఇప్పటికి ప్రశ్నగానే మిగిలిపోయింది. ఘటన జరిగి 45 నెలలు కావస్తున్నా ఈ కేసులో నగదు అంశాన్ని దర్యాప్తు అధికారులు తేల్చలేకపోతున్నారు. ఈ కేసును ప్రభుత్వ రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే అప్పుడప్పుడు దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు నటించడం తప్పితే అసలు విషయాలను బహిర్గతం చేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాల గుట్టు రట్టు చేయడం, వారు దోచుకుని దాచుకున్న సొత్తును సైతం వెలికితీయడంలో ఆరితేరిన మన తెలంగాణ పోలీసులు ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నగదుపై మాత్రం ఆరా తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ డబ్బు హవాలా ద్వారా వచ్చిందని ఈ విషయాన్ని తేల్చాలంటూ ఎసిబి అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులను కోరారు. రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఆరా తీసేందుకు ఇడి అధికారులు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహలతో పాటు మాజీ ఎంఎల్‌ఎ వేం నరేందర్‌రెడ్డి, అతని ఇద్దరు కుమారులను సైతం ఇడి అధికారులు ప్రశ్నించారు. అయినా నగదుపై సరైన సమాచారం రాబట్టలేక పోయారు. దీంతో వీరిని మరోసారి ఇడి అధికారులు విచారిస్తున్నారు.