వడగాల్పులతో ప్రజల ఉక్కిరిబిక్కిరి
కర్ఫ్యూను తలపిస్తున్న పట్టణాలు
సాధారణం కంటే 4 డిగ్రీలు పెరిగిన పగిటి ఉష్ణోగ్రతలు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులతో ఉద యం నుంచే వేడి వాతావరణం ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రోహిణి కార్తిలో రోళ్లు పగులుతాయి అంటారు. వేడి గాలు లు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, విశాఖ, కర్నూలు, వరంగల్ వంటి నగరాలు లాక్‌డౌన్ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. పలు నగరాల్లో దాదా పు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. వేడిని తాళలేక పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆదివా రం నుంచే మొదలైన వడగాల్పులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. సోమ, మంగళవారాలలో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 46.5 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్‌లో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం వాసులకు భానుడు చుక్కలు చూపుతున్నాడు. వడగాల్పులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక్కడ 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో వడగాల్పులకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ధ్రోణి ప్రభావంతో ఎపిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుంటాయి. కానీ ఇప్పుడు గాలి తన దిశను మార్చుకుని వాయువ్యం నుంచి వీస్తోంది. దీంతో తేమతగ్గి వేడి పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భల నుంచి ఈ వడగాలులు వీస్తున్నాయి.
దేశవ్యాప్తంగా భానుడి భగభగలు…
దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు హెచ్చు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త డాక్టర్ నరేశ్ కుమార్ తెలిపారు. హర్యానా, మధ్యప్రదేశ్, విదర్భ, రాజస్థాన్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెండు రోజుల తర్వాత స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. భానుడి భగభగకు మధ్య భారతం విలవిలలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంగళవారం నాగ్‌పూర్‌లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని విదర్భలో మూడు రోజుల కోసం రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో ఐదు రోజుల తర్వాత విదర్భ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు ఐఎండి అధికారులు చెబుతున్నారు. పశ్చిమ, తూర్పు మధ్యప్రదేశ్‌లలో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇక చత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్‌లో కూడా సూర్య ప్రతాపం కొనసాగుతున్నది. అమృత్‌సర్‌లో మంగళవారం మధ్యాహ్నం 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న మరికొన్ని రోజుల పాటు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వివరించారు. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో సహా దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.