‘పోతిరెడ్డిపాడు’పై జూన్ 2న కాంగ్రెస్ భారీ నిరసన
జిఒ 203 కెసిఆర్ ఇంటి సమస్య కాదు : ఉత్తమ్
పోతిరెడ్డిపాడుపై పోరాడింది పిజెఆర్.. కెసిఆర్ కాదు : రేవంత్
కెసిఆర్‌కు తెలిసే జిఒ 203 : నాగం
కావాలనే దక్షిణ తెలంగాణ ఎడారి : కోమటిరెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేలా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవడంలో సిఎం కెసిఆర్ వైఫల్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కార్యక్రమ వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. గాంధీభవన్‌లో టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ కూన శ్రీశైలం గౌడ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్‌లు సోమవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు ఎపి ప్రభుత్వం జారీ చేసిన జిఒ 203తో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందని, తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎపి సిఎం జగన్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్ రెండు మూడు సార్లు సమావేశమైనప్పుడు దీని గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ అసమర్థతతో, కుమ్మక్కయ్యారో తెలియదని, కాని ఇది కెసిఆర్ ఇంటి సమస్య కాదని తెలంగాణ రైతాంగ సమస్య అని అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు నీరు రావని, హైదరాబాద్ నగరానికి నీటి సమస్య ఎదురవుతుందని, సాగర్ డామ్ ఎండిపోతుందన్నారు. కాళేశ్వరం ద్వారా కేవలం రెండు టిఎంసిలు ఎత్తిపోసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, మరోవైపు గ్రావిటీ ద్వారా వచ్చే కృష్ణా జలాలను ఎందుకు వదులుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి నీటిని సాగర్‌లో ఎత్తిపోసేందుకు మరు రూ.2-3 లక్షలతో కొత్త ఎత్తకాన్ని తీసుకువచ్చి ముడుపులు పొందేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఊరికే వదిలిపెట్టదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నాటి సిఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ జిఒ తీసుకువస్తే తానే అరవీర భయంకరంగా పోరాడనని సిఎం కెసిఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. జిఒ వచ్చిన 2005 సెప్టెంబర్ 13న ఆయనకేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారని, పోతిరెడ్డిపాడుపై ఒక్క మాట మాట్లాడలేదని, చివరకు ఆ పదవికి రాజీనామా చేసిన 2005లో కూడా ఆ అంశాన్నేప్రస్తావించలేదన్నారు. అసలు ఆ జిఒకు వ్యతిరకంగా కొట్లాడించి నాటి కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పి.జనార్ధన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి అని, సొంత పార్టీ ప్రభుత్వాన్నే అసెంబ్లీలో నిలదీశారన్నారు. పదిహేనేళ్ళ క్రితం జరిగిన విషయం అందరూ మరిచిపోతారనే ఉద్దేశంతో పిజెఆర్ చేసిన పోరాటాన్ని కెసిఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. వాస్తవానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11500 క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచినా, 11,500 క్యూసెక్కులే వాడుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం జరిగిందని, కానీ కెసిఆర్ అధికారంలో ఉన్న ఆరేళ్ళలో 44వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నారని, దీనికి కెసిఆర్ అసమర్థతే కారణమన్నారు. వరద జలాల ప్రాతిపదికనే ఎపి ప్రాజెక్టులు కడుతోందని కెసిఆర్ సమర్థిస్తున్నారని, శ్రీశైలం రిజర్వాయర్‌లో 880 అడుగుల ఎగువన వచ్చే నీరే వరద జలాలని, కానీ ఎపి ప్రభుత్వం 790 అడుగుల వద్ద కొత్తగా రాయలసీమ ప్రాజెక్టు కడుతోందన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాకే 833 అడుగుల వద్ద మాల్యాల, 798 అడుగల వద్ద ముచ్చుమర్రి ప్రాజెక్టులు కట్టారని, ఇప్పుడు 854 అడుగల వద్ద పోతిరెడ్డిపాడు సామర్థ్యం రెట్టింపు చేయడమే కాకుండా 790 అడుగుల వద్ద కొత్త పథకాన్ని నిర్మిస్తున్నారని వివరించారు. కొత్తగా చేపట్టినవి పూర్తయితే తెలంగాణకు వచ్చే లోపలే కృష్ణా జలాల్లో 811 టిఎంసిలను ఎపి ప్రభుత్వం తరలించుకుపోతుందని, దీంతో పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బిసి, బీమా, నెట్టెంపాడు, బీమా, నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల సహా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఖాళీ అవుతాయన్నారు. ఇంత ప్రమాదం జరుగుతున్నా కెసిఆర్ తేలిగ్గా మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో గోదావరి నుండి దక్షిణ తెలంగాణకు మరో ఎత్తిపోతల నిర్మించి, అవినీతి పాల్పడేందుకు ఇదంతా చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అసలు జగన్, కెసిఆర్‌ల భేటీలో ఇరు రాష్ట్రాల మధ్యప్రతిపాదనలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెచ్చిన జిఒ 203 అమలు జరిగితే రోజుకు 14-15 టిఎంసిలు నీటి దోపిడీ జరుగుతుందని, ఇందుకు తెలంగాణ ద్రోహి కెసిఆర్ పాత్రనే ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఎపి అసెంబ్లీలోనే జగన్ రాయలసీమకు నీటిని తరలిస్తామని చెప్పిన కెసిఆర్ ఆయనకు దావతులు ఇచ్చారని, అలాగే స్వయంగా రాయలసీమను రతనాల సీమ చేస్తాన్నారని, అప్పుడే తమకు అనుమానం కలిగిందన్నారు. తాను కుర్చీ వేసుకొని ఎస్‌ఎల్‌బిసి పూర్తి చేస్తానన్న కెసిఆర్, ఆ తరువాత ప్రారంభించిన కాళేశ్వరం 90 శాతం పనులు పూర్తి చేశారని, కేవలం 30 శాతం పనులు మిగిలిన ఎస్‌ఎల్‌బిసిని వదిలేశారన్నారు. దీనిని బట్టి పద్ధతి ప్రకారమే దక్షిణ తెలంగాణకు నీరు రాకుండా చూస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. నాగం జనార్ధర్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఆమోదంతోనే జిఒ 203ను జగన్ జారీ చేశారని ఆరోపించారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల్లో కేటాయించిన నీళ్ళును కూడా వాడుకోకపోగా, ఆంధ్రప్రదేశ్ మాతరం అదనంగా 29టిఎంసిలను తరలించుకుపోతుందన్నారు. ఎప్పటికైనా కెసిఆర్ అవినీతి నిరూపితం కావడం ఖాయమని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.