జనవరిలో రెండు ఎంఎల్‌సి, మూడు కార్పొరేషన్ ఎన్నికలు
అధికార టిఆర్ఎస్కు పరీక్షే
కౌన్సిల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ వరుస ఓటమి
కీలకం కానున్న కొవిడ్, ఎపి ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్య
ప్రజాపక్షం / హైదరాబాద్ టిఆర్ఎస్ రెండో సారి గెలిచి రెండేళ్ళు పూర్తవుతున్న తరుణంలో మరో ఎన్నికల పరీక్షను ఎదుర్కోనుంది. వచ్చే ఏడాది జనవరిలోనే ఐదు ఎన్నికలకు నగారా మోగే అవకాశం ఉంది. అందులో రెండు ఎంఎల్‌సి, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందు లో నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మంకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా దక్షిణ తెలంగాణ పరిధిలో ఉండడం విశేషం. ఒక రకంగా ఇవన్నీ ఎన్నికలు మినీ జనరల్ ఎలక్షన్స్‌ను తలపించనున్నాయి. ఖాళీ కానున్న రెండు ఎంఎల్‌సిలలో ఒకటి టిఆర్ఎస్, మరొకటి బిజెపి చేతుల్లో ఉండగా, మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో టిఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. మారిన పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు కఠిన సవాళ్ళను ఎదుర్కొంటుంది. అందులో ప్రధానంగా అందరినీ అతలాకుతలం చేస్తున్న కొవిడ్ మహమ్మారి. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం బాగానే అదుపు చేసిందనే ప్రచారం జరిగినా, తరువాత దాదాపుగా చేతులు దాటిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా పాజిటివ్ సోకింది. ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే ప్రజలు ఒకింత సందేహిస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రులకు పోతే లక్షల బిల్లుతో అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా లాక్డౌన్, కొవిడ్ నిబంధనలతో చాలా మంది ఉపాధి కోల్పోవడంతో ప్రజల జీవితాలపై, ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నదీజలాల విషయంలో కొత్త పంచాయతీ తెరపైకి తెచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో సంగమేశ్వరం వద్ద ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. ఎపి కొత్త ప్రాజెక్టుల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆలస్యంగా స్పందించిందనే అభిప్రాయాన్ని ఇప్పటికే విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాయి. అవి పూర్తయితే దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా ఈ ప్రాంతానికి సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పథకం, మహబూబ్‌నగర్‌లో ప్రాజెక్టులు, ఎస్ఎల్బిసి వంటివి తెలంగాణ ఏర్పడి ఆరేళ్లునా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికలన్నీ దక్షిణ తెలంగాణలోనే జరగనుండడంతో ఎపి ప్రాజెక్టులు కూడా టిఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ నినాదమైన ఉద్యోగాలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే తెలంగాణలో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి గూడు కట్టుకున్నది. పైగా గత ఎన్నికల్లో నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగభృతి ఇస్తామన్న హామీ, బడ్జెట్లో పెట్టి కూడా రెండేళ్ళైనా అమలు చేయలేదు.
టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వరుస ఓటమి
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్, కొద్ది మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భంగపడింది. అలాగే మూడు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూడా పరాభవం పొందింది. ఆ మూడు కూడా గతంలో టిఆర్ఎస్ చేతుల్లో ఉన్నవే. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి గెలుపొందారు. అదే నియోజకవర్గం టీచర్స్ ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎంఎల్‌సి పాతూరి సుధాకర్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. అలాగే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ఎంఎల్‌సి పూల రవీందర్ ఓడిపోయారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి నియోజకవర్గం నుండి రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి నుండి బిజెపి ఎంఎల్‌సి రామచంద్రారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పట్టభద్రుల నియోజవర్గాల్లో నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉంటారు. సాధారణ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్కు 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లలో ప్రత్యర్థులు ఆధిక్యం సాధించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, గడువు దాటి మూడేళ్ళవుతున్నా పిఆర్ఎస్ లేక ప్రభుత్వోద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లో టిఆర్ఎస్ ఏకపక్షంగా గెలిచినప్పటికీ, ఇటీవల కొవిడ్‌తో పాటు గతంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ హామీ నెరవేరకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకున్నది. కానీ టిఆర్ఎస్ వాటిని చేజార్చుకోకుండా సకల ప్రయత్నాలు చేస్తున్నది. హైదరాబాద్‌లో కొత్త ఫ్లువర్లను ప్రారంభిస్తూ, త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇస్తామని ఓటర్లను ఇప్పటి నుండే ఊరిస్తుంది. ఇటీవల వరదల్లో చిక్కుకున్న వరంగల్, ఖమ్మంలో మంత్రులు పర్యటించి హడావుడి చేశారు.