సంయుక్తంగా ప్రారంభించిన ప్రధాని మోడీ, నేపాల్ పిఎం ఓలి
ఖాట్మండు/న్యూఢిల్లీ: దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ ప్రధాని కెపి ఓలి సంయుక్తంగా ఆరంభించారు. నేపాల్ ఇంధన అవసరాలను తక్కువ ధరలో తీర్చేందుకు నిరంతర సప్లయ్‌కు ఈ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. బీహార్‌లోని మోతీహారి నుంచి నేపాల్‌లోని అమ్లేఖ్‌గంజ్ వరకు 69 కిమీ. ఈ చమురు పైప్‌లైన్‌ను వీడియో లింక్ ద్వారా రెండు దేశాల ప్రధానులు తమతమ దేశ రాజధానుల్లో ఆరంభించా రు. దక్షిణాసియాలో ఇదే తొలి పెట్రోలియం పైప్‌లైన్ అని నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఒసిఎల్), నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఒసిఎల్) సహకారంతో రూ. 324 కోట్ల వ్యయంతో ఈ పైప్‌లైన్‌ను నిర్మించింది. 2014 ఆగస్టులో చేసుకున్న అవగాహన పత్రం కమిట్‌మెంట్‌ను పూర్తి చేసింది. అమ్లేఖ్‌గంజ్‌లో అదనపు స్టోరేజి వసితిని నిర్మించేందుకు కూడా కృషిచేస్తున్నాయి. దానికి రూ. 75 కోట్లు ఖర్చు కాగలదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంచనావేసింది. ఈ సందర్భంగా మోడీ ‘నేపాల్ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉంది’ అన్నారు. భారత్, నేపాల్ మధ్య నిర్మించిన పైప్‌లైన్‌ని రికార్డు టైమ్‌లో పూర్తిచేశామని చెప్పారు. నిర్మించాల్సిన గడువు 30 నెలలు కాగా దానిని కేవలం 15 నెలల్లోనే పూర్తి చేసినట్లు వివరించారు. ఈ పైప్‌లైన్ ప్రతి ఏడాది రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధమైన పెట్రోలియం ఉత్పత్తులను చౌక ధరలో నేపాల్‌కు అందిస్తుంది. దీంతో నేపాల్ ప్రజలు లబ్ధి పొందనున్నారు. నేపాల్‌కు ఈ పైప్‌లైన్ పెద్ద సాధన అని నేపాల్ ప్రధాని ఓలి వ్యాఖ్యానించారు. దీని ద్వారా నేపాల్, భారత్ పరస్పరం ఆదానప్రదాన దేశాలుగా మారుతాయని కూడా చెప్పారు. ఈ పైప్‌లైన్‌కు నేపాల్ దిక్కున నేపాల్ సైన్యం రక్షణ కల్పించనుంది. ఈ పైప్‌లైన్‌కు టెలీ సిస్టం, అత్యాధునిక లీక్ డిటెక్షన్ సిస్టం ఉన్నాయి. లీకేజీ, ధ్వంసం ఏమాత్రం జరిగినా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా వెంటనే కంట్రోల్ సెంటర్లకు తెలిసిపోతుంది.