ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో పొంచివున్న ముప్పు
న్యూఢిల్లీ : కరోనా థర్డ్‌వేవ్ తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే, ఈ ముప్పు త్వరలోనే భారత్‌ను కూడా ముంచెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన కలుగుతున్నది. కరోనా నిబంధనల అమలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి కారణంగా ముప్పు ఏ క్షణంలోనైనా విరుచుకు పడడం ఖాయంగా కనిపిస్తున్నది. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, థాయిలాండ్ తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్న జపాన్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒకే రోజు 3,177 కేసులు నమోదు కావడం జపాన్‌లో ఆందోళనకు కారణమవుతున్నది. టోక్యో ఒలింపిక్స్‌ను స్థానికులు ‘సూపర్ స్ప్రెడర్’గా ఎందుకు అనుమానించారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభిస్తున్నది. అమెరికాలో వ్యాక్సినేషన్‌పై ప్రజలు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో మరోసారి అక్కడ కరోనా విలయతాండం చేసే ప్రమాదం కనిపిస్తున్నది. ‘మా ముఖం.. మా ఇష్టం.. మాస్క్ పెట్టుకోమని అడగడానికి మీరు ఎవరు?’ అంటూ నిబంధనలపై మండిపడిన అప్పటి దేశాధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నది. కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం కరోనా వ్యాప్తికి కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, మన దేశంలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, కేసుల పెరుగుదల మరింత భయాన్ని కలిగిస్తున్నది. థర్డ్‌వేవ్‌లో డెల్టా, డెల్టాప్లస్‌సహా రకరకాలైన కరోనా వేరియంట్లు దాడి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. కానీ, వారి హెచ్చరికలు, సూచనలు వృథా ప్రయాసగానే మారిపోతున్నాయని పెరుగుతున్న కేసులే నిరూపిస్తున్నాయి. కరోనా ఫస్ట్‌వేవ్ తర్వాత నిర్లక్ష్యంగా ఉండడంవల్లే సెకండ్‌వేవ్‌లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కేసులే కాదు.. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సుమారు 4.5 లక్షల మంది కొవిడ్ కారణంగా మృతి చెందినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, అంతర్జాతీయ అధ్యయన సంస్థలు భారత్‌లో సెకండ్‌వేవ్ మృతులు 49 లక్షలకుపైగానే ఉన్నాయని ప్రకటించాయి. లెక్కలు ఎంత గందరగోళంగా ఉన్నాయో చెప్పేందుకు ఈ తేడాయే నిదర్శనం. నివేదికలు, అధ్యయనాలలో నిజానిజాలు ఎలావున్నప్పటికీ, సెకండ్‌వేవ్ తీవ్రతను ఎవరూ కాదనలేరు. ఒక వేరియంట్‌కు చికిత్సను కనుక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతన్న సమయంలోనే మరిన్ని వేరియంట్లు, మ్యూటెంట్లు పుట్టుకురావడంతో కేసులు, మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండింది. అయితే, ఫస్ట్‌వేవ్ తర్వాత ఎంతటి నిర్లక్ష్యంగా ఉండి, సెకండ్‌వేవ్‌లో దారుణంగా దెబ్బతిన్నామో, ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యాన్ని, అదే ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నామన్నది వాస్తవం. పెళ్లి లేదా చావు.. పుట్టిన రోజు లేదా వర్ధంతి.. పండుగలు లేదా సామూహిక ప్రార్థనలు.. మార్గం ఏదైనప్పటికీ, అన్నీ కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఉత్ప్రేరకాలే. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారంతా సూపర్ స్ప్రెడర్లే. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
థర్డ్ వేవ్ తప్పదా?
RELATED ARTICLES