సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టనున్న రష్యా
ప్రజాపక్షం/ హైదరాబాద్ :రష్యాలో తయారవుతున్న సింగిల్ డోస్ టీకా ‘స్పుత్నిక్ లైట్’ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే స్పుత్నిక్ ‘వి’ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ద్వారా భారత్‌లోనే ఉత్పత్తి చేయడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నది. అదే తరహాలో సింగిల్ డోస్ కొవిడ్-19 వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’ ప్రవేశపెట్టే ఆలోచనలో రష్యా ఉంది. ఇప్పటి వరకూ జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రమే సింగిల్ డోస్ టీకాను ఉత్పత్తి చేస్తున్నది. అయితే, ఆ కంపెనీ వ్యాక్సిన్లు ఇంకా భారత్ మార్కెట్‌లోకి రాలేదు. ఇలావుంటే, హైదరాబాద్‌కు స్పుత్నిక్ ‘వి’ వ్యాక్సిన్ రెండో బ్యాచ్ డెలివిరీ అనంతరం రష్యా రాయబారి నికోలయ్ కుదాషెవ్ ఆదివారంనాడు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, ఇండియాలో స్పుత్నిక్ వి ఉత్పత్తి క్రమంగా ఏటా 850 మిలియిన్ డోస్‌లకు పెంచాలని రష్యా యోచిస్తున్నదని తెలిపారు. కరోనా కట్టడికి భారత్‌తో ద్వైపాక్షిక, బహుముఖ సహకార విస్తరణకు రష్యా ఆసక్తిగా ఉందన్నారు. కొవిడ్ న్యూ స్ట్రెయిన్స్‌ను సైతం స్పుత్నిక్ ‘వి’ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. అంతకు ముందు, రష్యా నుంచి స్పుత్నిక్ ‘-వి’ వ్యాక్సిన్‌లు హైదరాబాద్ చేరా యి. రెండో విడుతగా 1.50 లక్షల డోసులు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకన్నాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డిస్ ల్యాబ్‌కు తరలించారు. 67 లక్షల డోసులు కావాలని కంపెనీ ఆర్‌డిఐఎఫ్‌ను కోరగా రష్యా వాటిని విడతల వారీగా పంపిస్తోంది. జూన్ నుంచి దేశంలోనే స్పుత్నిక్- ‘వి’ వ్యాక్సిన్‌లను స్థానికంగానే ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డిస్ ల్యాబ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఎగుమతి చేస్తుంది. డాక్టర్ రెడ్డిస్ ఒప్పందం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డిసిజిఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల వ్యాక్సిన్కు సంబంధించిన ధరను సైతం డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ప్రకటించింది. ఒక్కో డోస్ ధర 995రూపాయలుగా నిర్ణయించింది. టీకా వాస్తవ ధర రూ. 948. టీకా 91.6 శాతం ప్రభావంతం పని చేస్తుందని ఆర్‌డిఐఎఫ్ తెలిపింది. దీన్ని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేసే అవకాశం ఉంది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వనున్నారు. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆర్‌డిఐఎఫ్ వివరించింది.
త్వరలో భారత్‌కు ‘స్పుత్నిక్ లైట్’
RELATED ARTICLES