ఆదర్శంగా ఉండేలా కొత్త విధానాలు
‘కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చాగోష్టిలో’ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్
రైతులకు ఎటువంటి భూమి చిక్కులు లేకుండా ఆదర్శవంతమైన ‘నూత రెవెన్యూ చట్టం-2024’ను రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి,మరొకఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా, రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని తెలిపారు. చట్టాలు సరిగ్గా రూపొందించకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘2020 రెవెన్యూ చట్ట’మే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ‘నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా’ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఏర్పాటు చేసిన చర్చావేదిక కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వం తరహా కాకుండా ఒక రోజు ఆలస్యమైనప్పటికీ సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్య త్తు తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. సామాన్యుని నుంచి మేధావి వరకు అన్ని వర్గాల అ భిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకే ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టామన్నారు. ఇటువంటి చర్చావేదికలను కూడా ఏ ర్పాటు చేస్తున్నామని వివరించారు. మనం భౌతికంగా ఉన్నా లేకున్నా అ ధికారంలో ఉన్నా లేకున్నా మనం తీసుకొచ్చిన చట్టాలు పదిమందికి ఉపయోగపడేలా శాశ్వతంగా ఉండేలా రూపొందించాలన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన చేయకుండానే దొర’కు నచ్చలేదనే ఉద్ధేశ్యంతో గత ప్రభుత్వం విఆర్‌ఒ, విఎఒ వ్యవస్థను ఉన్న పళంగా రద్దు చేసి, మొత్తంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ భూ పరిపాలన చూసే యంత్రాంగం లేకుండా చేసిందని దుయ్యబట్టారు. రైతులకు, ప్రజలకు రెవెన్యూ అందుబాటులో లేకుండా పోయాయని, అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో సిఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారని, తమ హామీని విశ్వసించి తెలంగాణ ప్రజానీకం తమకు అధికారాన్ని అప్పగించారన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాలలో అన్ని వర్గాల ఆలోచనలను,అభిప్రాయాలను, పెద్దల సలహాలను సూచనలను పరిగణనలోకి తీసుకోకపోతే ఎటువం సంస్కరణలు జరిగినా శూన్యగతికే చేరుకుంటుందనేందుకు నిలువెత్తు నిదర్శనమే ధరణి అని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడే విషయంలో తమకు స్పష్టత ఉన్నదని, రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని అలాగే రెవెన్యూ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని, అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సానుకూలంగా వ్యహరిస్తామని, త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావలంటే కేవలం సిఎం, రెవెన్యూ మంత్రి ఇద్దరే పని చేస్తే సాధ్యం కాదని, రెవెన్యూ ఉద్యోగులందరూ సమిష్టిగా నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేస్తేనే సాధ్యమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.