సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
అవసరమైన నిధులు ప్రభుత్వమే కేటాయించాలి
కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను నిర్మించడంలో ప్రభుత్వాలు విఫలం
ప్రజాపక్షం / హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిఎం కెసిఆర్ ఎంత దృష్టి పెట్టారో, కృష్ణా జలాల ఆధారిత పాలమూరు – ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం( ఎస్‌ఎల్‌బిసి) పథకంపై కూడా అంతే ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బ్యాంకు లింకేజీ ఉన్నప్పటికీ, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవి సరిపోవని, అవసరమైన నిధులను ప్రభుత్వమే కేటాయించాలన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయి తే వలసల నుండి ఉమ్మడి మహబూబ్‌నగర్, ఫ్లోరైడ్ నుండి నల్లగొండ జిల్లాలు బయటపడి సస్యశ్యామలమవుతాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇటు తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళ కాలంలోనూ కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను నిర్మించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను ఈ నెల 27-,28 తేదీలలో సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మలతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రాజెక్టుల పర్యటన వివరాలను చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సిపిఐ ప్రతినిధి బృందం పాలమూరు పథకం, దాని కింద ఉండే ఏదుల, ఉద్దండాపూర్, గుడిపల్లిగట్టు తదితర రిజర్వాయర్‌లతో పాటు ఎస్‌ఎల్‌బిసి, నక్కలగండి, డిండి రిజర్వాయర్‌లను పరిశీలించామని తెలిపారు. తమ పర్యటనలో భాగంగా అంశాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందజేస్తామని, ఆయనను మీడియా ద్వారానే అపాయింట్‌మెంట్ కోరుతన్నామని చాడ అన్నారు. సిఎం కెసిఆర్ 2015లో పాలమూరు పథకం ( పిఎంఆర్)కు సంబంధించి కొత్త జిఒ జారీ చేశారని, రూ.35,200 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారన్నారు. అయితే, ఏడేళ్ళలో ప్రాజెక్టు అంచనాలో రూ.13,620 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. దీని కింద ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్‌లు 80 శాతం పనులు పూర్తయ్యాయని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ఇంకా చేపట్టాల్సి ఉన్నదని, అది పూర్తయితేనే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరు అందుతుందన్నారు.
మూడవ వంతుతో ఎప్పుడు పూర్తి?
పాలమూరు పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారని, తమ పరిశీలనలో మాటలకు చేతలకు… భూమి,ఆకాశమంత వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమైనదని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అంచనా మొత్తంలో కనీసం మూడవ వంతు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని, ఇలాగైతే ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 టిఎంసిలు ఎత్తిపోయాలని జిఒ ఇచ్చారని, కానీ ఒక్క టిఎంసికే పంపులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజక్టుకు ముందు 800 అడుగుల వద్ద సంగమేశ్వరం నుండి రోజుకు మూడు టిఎంసిలు, పోతిరెడ్డి పాడు కాలువ ద్వారా నాలుగు టిఎంసిలు చొప్పున ఏడు టిఎంసిలు తీసుకెళ్ళేందుకు నిర్మాణ పనులను వేగిరపరుస్తుంటే, మనం ఏడేళ్ళలో పిఎంఆర్‌ను పూర్తి చేసి రోజుకు రెండు టిఎంసిలను ఎత్తిపోసుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయడం ద్వారా ధరలు పెరిగి, అంచనా వ్యయం కూడా పెరుగుతున్నదన్నారు. పిఎంఆర్ కొత్త ప్రాజెక్టు అని ఎపి ప్రభుత్వ అభ్యంతరం సమంజసం కాదని, ఉమ్మడి ఎపిలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి జూరాల నుండి నీటిని ఎత్తిపోసుకునేందుకు జిఒ ఇచ్చారని గుర్తు చేశారు.
ఎస్‌ఎల్‌బిసి ఇంకెప్పుడు?
ఎస్‌ఎల్‌బిసిని 2005లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభించారని, 51 కిలోమీటర్ల సొరంగ మార్గానికి 17 ఏళ్ళు గడుస్తున్నా 41 కిలోమీటర్లే పూర్తయ్యాయని, ఇంకా పది కిలోమీటర్లు తవ్వాల్సి ఉన్నదని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎత్తిపోత లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే ఈ పథకాన్ని ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు. రూ.1700 కోట్లు కేటాయిస్తే ఈ పథకం పూర్తి అవుతుందని, తక్షణమే ఆ మేరకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నక్కలగండి డ్యామ్ కింద మూడు తండాల భూ నిర్వాసితులకు మార్కెట్ ధరకు భూమి సేకరించాలని, మంచి సహాయ, పునరావాస ప్య్రాకేజీని ఇవ్వాలని సూచించారు. అలాగే డ్యామ్ ఎగువన ఉండే మోత తండాకు సీపేజీ ముప్పు ఉన్నదని, ఆ గ్రామస్తులకు కూడా పునరావాస ప్యాకేజీ ప్రకటించి, ఖాళీ చేయించాలని కోరారు. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకానికి రూ.270 కోట్లు, కాలువల భూసేకరణకు రూ.240 కోట్లు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయని తెలిపారు. డిండి రిజర్వాయర్‌కు నీటిని తొలుత నక్కల గండి రిజర్వాయర్ నుండి ఎత్తిపోస్తామని ప్రకటించారని, తరువాత పింఎఆర్ ద్వారా ఏదుల నుండి టన్నెల్ ద్వారా పంపిస్తామన్నారని, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారాలు లేకుండా అవినీతి గురించి తాము మాట్లాడబోమని చాడ వెంకట్‌రెడ్డి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
త్వరగా ఎస్‌ఎల్‌బిసి పూర్తి
RELATED ARTICLES