85.76 శాతం పోలింగ్
అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 95.32% పోలింగ్
అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 78.47%
కమిషనరేట్ నుంచి పోలింగ్, కౌంటింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణ
కొనసాగిన అధికారపార్టీ హవా
ఉనికి చాటుకున్న వామపక్షాలు : విపక్షాలకు ఊరట
ప్రజాపక్షం / హైదరాబాద్ : తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్క డా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. జనగాం జిల్లా బచ్చన్నపేట పం చాయతీలోని ఒక వార్డులో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా ఆరుగురుతో కూడిన బ్యాలట్ పేపర్లు వచ్చాయి. దీనిని గ్రహించి అరగంటలో అధికారులు సమస్యను పరిష్కరించారు. సిబ్బంది వేరే బ్యాలట్ పేపర్లను తీసుకోవడంతో ఈ పొరపాటు చోటుచేసుకుం ది. వెంటనే సంబంధిత వార్డు బ్యాలట్ పేపర్లను అక్కడ ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ముందు కాస్తా మందకొడిగా సాగినప్పటికీ క్రమేపీ పెరిగింది. తొలి విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ మొదలయింది. కడపటి సమాచారం మేరకు వెలుబడ్డ ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయాలను సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటని సిపిఐ, సిపిఎంలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయాలను కైవసం చేసుకుని గ్రామస్థాయిలో తమ ఉనికి ఉందని నిరూపించుకున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు సిపిఐ మద్దతు దారులు 13 గ్రామపంచాయతీల్లో, సిపిఎం 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులను సొంతం చేసుకున్నారు. టిడిపి సైతం 19 గ్రామ పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు గ్రామ పంచాయతీల్లోనూ ఆశించిన మేర సంతృప్తి మిగల్లేదు. కాంగ్రెస్ మద్దతుదారులు 635 గ్రామ పంచాయతీలను సొంతం చేసుకున్నారు. బిజెపి మద్దతుదారులు 46 గ్రామ పంచాయతీల్లో విజయం సొంతం చేసుకోవడం కమలనాథులకు ఊరటనిచ్చింది. అధికార పార్టీ టిఆర్‌ఎస్ మద్దతు దారులు 2056 గ్రామ పంచాయతీలను సొంతం చేసుకున్నారు.