71 పరుగులతో కివీస్ చిత్తు
సిరీస్ ఆధిక్యంలో ఆస్ట్రేలియా
సిడ్నీ: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (67), ఆరోన్ ఫించ్ (60), లబుషేన్ (56) అర్ధశతకాలతో రాణించారు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి మూడు, లాకీ ఫెర్గూసన్, మిచెల్ శాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన కివీస్ 187 పరుగులకే కుప్పకూలింది. మార్టిన్ గప్తిల్ (40), టామ్ లేథమ్ (38) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, మిచెల్ మార్ష్ చెరో మూడు, జంపా, హేజిల్వు్డ చెరో రెండు వికెట్లు తీశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ మార్ష్‌కు దక్కింది. సిడ్నీ వేదికగానే రెండో వన్డే ఆదివారం జరగనుంది. కరోనా విజృంభిస్తుండటంతో మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించట్లేదు.
షేక్‌హ్యాండ్ ఇవ్వబోయి..
ఈ వన్డేలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. కరోనా ప్రభావంతో ప్రజలంతా కరచాలనం చేయడానికి జంకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడాకారులు సైతం ప్రత్యర్థులతో కరచాలనం చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఇంగ్లాండ్ అన్ని జట్లకన్నా ముందుంది. ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనానికి బదులు ఫిస్ట్బంప్స్ చేయాలని నిర్ణయించుకుంది. కాగా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇతర ఆటగాళ్లు సైతం కరచాలనం చేయడానికి భయపడుతున్నారు. ఇక శుక్రవారం ఆస్ట్రేలియా x న్యూజిలాండ్ తలపడుతున్న తొలి వన్డేలో ఆయా జట్ల సారథులు అలవాటులో పొరపాటు చేశారు. టాస్ వేసేటప్పుడు ఆరోన్ ఫించ్, కేన్ విలియమ్సన్ ఎప్పటిలాగే కరచాలనం చేసుకొని తర్వాత నవ్వుకున్నారు. ఆపై మోచేతులను తాకించుకొని వెళ్లిపోయారు. కాగా, ఈ వన్డే సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రేక్షకులను అనమతించకుండా నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్టాండ్ల మధ్యే ఇరు జట్లూ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన భారీ సిక్స్ స్టాండ్స్‌లోకి దూసుకుపోయింది. అక్కడ బంతిని అందివ్వడానికి ఎవ్వరూ లేకపోవడంతో ఫీల్డర్ ఖాళీ స్టాండ్స్‌లోకి వెళ్లి బంతిని వెతికి మైదానంలోకి విసిరాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన ఫొటోలను ఓ ఆస్ట్రేలియా క్రికెట్ ఛానల్ ట్విటర్లో పోస్టు చేసింది. మరోవైపు తొలి వన్డేకు ముందు ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్ కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి గొంతు సమస్య తలెత్తడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. రిచర్డ్సన్ను ప్రత్యేకంగా ఉంచి పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.
కేన్ రిచర్డ్సన్కు ఉపశమనం
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ కేన్ రిచర్డ్సన్కు ఉపశమనం లభించింది. రిచర్డ్సన్కు కరోనా వైరస్ (కొవిడ్-19) నెగిటివ్ అని తేలింది. గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు రిచర్డ్సన్కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించింది. రిపోర్టులలో అతనికి కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ‘శుక్రవారం నిర్వహించిన పరీక్షలో పేసర్ కేన్ రిచర్డ్సన్కు కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చింది. అతడు హోటల్ నుంచి సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వెళ్లడానికి అనుమతి లభించింది’ అని సీఏ తెలిపింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చిన రిచర్డ్సన్.. గొంతులో మంటగా ఉందని చెప్పడంతో ఆసీస్ క్రికెట్ బోర్డు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. అతడిని జట్టు నుంచి ప్రత్యేకంగా ఉంచి పరీక్షలు నిర్వహించింది. రిచర్డ్సన్కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్‌తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్సన్కు బదులు సీన్ అబాట్‌ను సీఏ ఎంపిక చేసింది. ఇది సాధారణ గొంతు నొప్పి అని, కానీ.. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు రిచర్డ్సన్కు పరీక్షలు నిర్వహిస్తామని సీఏ ప్రతినిధి అంతకుముందే తెలిపారు.
తొలి వన్డేల్లో ఆసీస్ విజయం
RELATED ARTICLES