వార్నర్ వరుసగా సెంచరీలు
స్మిత్ రికార్డుల మోత
భారీ సెంచరీతో రాణించిన లబుసేన్
ఆసీస్ 589/3 డిక్లేర్డ్
పాక్‌తో డే/నైట్ టెస్టు
అడిలైడ్ : రికార్డులు బద్దలు కొట్టడంలో తనకు మించిన ఆటగాడు లేడని ఆసీస్ క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి నిరూపించాడు. పాకిస్తాన్‌తో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో భారీ సెంచరీతో మెరిసిన వార్నర్ అదే జోరును రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తొలి రోజు ఆటలో అలవోకగా సెంచరీ సాధించిన వార్నర్ శనివారం ఆటలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 394 బంతుల్లో 37 ఫోర్లతో వార్నర్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కాగా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. ఇక పాకిస్తాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆసీస్ ఆటగాడిగా గుర్తింపు సాధించిన వార్నర్.. ఓపెనర్‌గా నాల్గో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్.డే అండ్ నైట్ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన నయా రికార్డును వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు వరకూ పాకిస్తాన్ కెప్టెన్ అజహర్ అలీ(302 నాటౌట్) పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని వార్నర్ బ్రేక్ చేశాడు. వార్నర్ 303 పరుగులకు చేరిన తర్వాత అజహర్ అలీ రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ క్రమంలో డాన్ బ్రాడ్మన్, మార్క్ చేసిన 334 పరుగుల రికార్డును వార్నర్ బద్దలు చేశాడు. మాథ్యూ హెడెన్ 2003లో జింబాబ్వేపై చేసిన 380 పరుగుల అత్యధిక స్కోరు తర్వాత వార్నర్ ఆసీస్ తరపున రెండో స్థానంలో నిలిచాడు.డే అండ్ నైట్ టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల సాధించిన రికార్డును కూడా వార్నర్ సాధించాడు. డే అండ్ నైట్ టెస్టుల్లో అజహర్ అలీ మొత్తంగా 456 పరుగులు చేస్తే దాన్ని వార్నర్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును కూడా వార్నర్ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన పుణె టెస్టులో కోహ్లి అజేయంగా 254 వ్యక్తిగత పరుగులు సాధించగా, దాన్ని వార్నర్ సవరించాడు.తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. రెండో రోజు ఆటలో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. 166 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన వార్నర్ సమయోచితంగా ఆడి ద్విశతకం నమోదు చేశాడు. ఆపై ట్రిపుల్ సెంచరీని సాధించాడు. స్టీవ్ స్మిత్(36) మూడో వికెట్‌గా ఔటైనప్పటికీ వార్నర్ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. డబుల్ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుని ఆసీస్‌కు భారీ స్కోరును సాధించిపెట్టాడు. లబూషేన్‌తో కలిసి వార్నర్ 361 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ సమయానికి వార్నర్ 418 బంతులాడి 39 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఈ ట్రిపుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ ట్రిపుల్ సెంచరీతో అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఇప్పటివరకు మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్(299) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు కనుమరుగైంది. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా చేసిన నాలుగో ట్రిపుల్ సెంచరీ ఇది.
కోహ్లీ, సచిన్‌లను వెనక్కి నెట్టిన స్మిత్..
స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పాక్ బౌలర్ మహ్మద్ ముసా బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా స్మిత్ ఈ ఘనత సాధించాడు. అయితే, టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రికార్డుని ఆటగాడిగా స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 73 ఏళ్ల రికార్డును స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు. 1946లో ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ వాలీ హమ్మాండ్ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల్ని సాధించాడు. స్టీవ్ స్మిత్ 126 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయని సాధించాడు. ప్రస్తుతం పాక్‌తో ఆడుతోన్న టెస్టు స్టీవ్ స్మిత్‌కు 70వ టెస్టు కావడం విశేషం. ఫలితంగా టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల రికార్డుని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హమ్మాండ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్‌ల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక, సచిన్ టెండూల్కర్(136) నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ, కుమార సంగక్కార, గ్యారీ సోబర్స్(138)లు సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. దీంత పాటు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 20 పరుగులు చేయడం ద్వారా డాన్ బ్రాడ్‌మన్(6996) రికార్డు కూడా బద్దలైంది. ఇక, ఆస్ట్రేలియా తరఫున 7000 టెస్టు పరుగులు సాధించిన 11వ ఆటగాడి స్మిత్ నిలిచాడు. బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 6,996 పరుగులు చేయగా.. స్మిత్ 69 టెస్టుల్లో 6,977 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్‌కి ముందు బ్రాడ్‌మన్‌ను అధిగమించడానికి స్మిత్ కేవలం 20 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో బ్రాడ్‌మన్ 29 సెంచరీలు చేసాడు. స్మిత్ 26 సెంచరీలు చేసాడు. బ్రాడ్‌మన్ సెంచరీలను అందుకోవడానికి స్మిత్ మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (13,378) అగ్రస్థానంలో ఉన్నాడు.
యాషిర్ షా చెత్త రికార్డు..
ఈ రెండు టెస్టుల సిరీస్ పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షాకు మరొకసారి పీడకలగా మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో యాసిర్ షా ఇప్పటివరకూ ఇచ్చిన పరుగులు 402. ఒకవేళ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం వస్తే యాసిర్ ఇంకా ఎన్ని పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలను నమోదు చేస్తాడో చూడాలి. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ కేవలం ఇన్నింగ్స్ మాత్రమే ఆడగా యాసిర్ షా 48.4 ఓవర్లు వేసి 205 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇవ్వడంతో యాసిర్ షాది నామమాత్రపు బౌలింగ్‌గానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇక అడిలైడ్ టెస్టులో యాసిర్ షా 32 ఓవర్లు వేసి 197 పరుగులు ఇచ్చాడు. అంటే రెండు టెస్టుల్లో కలిసి 80.4 ఓవర్లు వేసిన యాసిర్ షా 402 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతని బౌలింగ్ యావరేజ్ 100.5 గా ఉండగా, స్టైక్‌రేట్(వికెట్ తీయడానికి పట్టిన బంతులు) 121గా నమోదైంది. అడిలైడ్ టెస్టులో యాసిర్ షా 197 పరుగులిస్తే, అందులో వార్నర్ ఒక్కడే 111 పరుగులు సాధించడం ఇక్కడ గమనార్హం. 2016 సీజన్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్న యాసిర్ షా.. మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లోనే 207 పరుగులిచ్చాడు. ఇప్పుడు కూడా యాసిర్ షా బౌలింగ్‌ను ఆస్ట్రేలియన్లు ఆడేసుకోవడంతో అతను చెత్త గణాంకాలతో మరోసారి స్వదేశానికి వెళ్లనున్నాడు.
పాక్ బ్యాట్స్‌మెన్లు బెంబేలు..
ఆసీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ చతికిల పడుతున్నారు. ఇన్నింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే (3 పరుగులకే) ఓపెనర్ ఇమాముల్ హక్ ఔట్ అయ్యాడు. మరికాసేపటికే కెప్టెన్ అజహర్ అలీ(9) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో స్టివ్‌స్మిత్‌కు చిక్కాడు. పాక్ ప్రస్తుతం 33.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 91 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ ఆజమ్(42 బ్యాటింగ్), యాసిర్ షా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, హెజెల్‌వుడ్ చెరో వికెట్ తీశారు.
తొలి ట్రిపుల్ సెంచరీ
RELATED ARTICLES