న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓటమి
సమష్టిగా విఫలమైన టీమిండియా ఆటగాళ్లు
10 వికెట్ల తేడాతో కివీస్ గెలుపు
1-0తో సిరీస్ ఆధిక్యంలో బ్లాక్‌క్యాప్స్ జట్టు
వెల్లింగ్టన్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను ఫామ్‌ను కొనసాగించిన ఆతిథ్య జట్టు.. టెస్టు మ్యాచ్‌ను సైతం సునాయాసంగా గెలుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 144/4 తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ ముందు కేవలం 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 1.4 ఓవర్లలో ఇంకా ఒకరోజు ఉండేగానే మ్యాచ్‌ను ముగించింది. ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా టీమ్ సౌథీ నిలిచాడు. ఇది కివీస్ జట్టుకు 100వ టెస్ట్ విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 144/4తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కివీస్ పేసర్ల ధాటికి కుదేలైంది. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 47 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. అజింక్య రహానే (29), హనుమ విహారి (15) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 148 పరుగుల వద్ద అజింక్యా రహానె(29) బౌల్ట్ చేతికి చిక్కాడు. అనంతరం 148 పరుగుల వద్దనే హనుమ విహారి (15) సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పది బంతుల్లోనే విజయం
అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (41 బంతుల్లో 25) కాసేపు కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కాసేపటికి సౌథీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు పంత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరుగడంతో భారత లోయర్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. దీంతో భారత్ ఓటమి లాంఛనమైంది. మయాంక్ అగర్వాల్ (58) మాత్రమే రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ చెలరేగి ఐదు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ సౌథీ నాలుగు వికెట్లు తీసి మొత్తంగా 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బౌల్ట్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలా్‌ండ వికెట్ నష్టపోకుండా 1.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ టామ్ లాతమ్ బౌండరీతో సహా 8 పరుగులు చేసాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ సింగల్ తీసి లాంఛనం పూర్తిచేసాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 29న ప్రారంభం కానుంది.
స్కోరు బోర్డు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 165ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్: 191 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్: 348 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 9 పరుగులు (వికెట్ నష్టపోకుండా)
తొలి ఓటమి
RELATED ARTICLES