వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు
నేడు మళ్లీ విచారణ
హైదరాబాద్ : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని కడప ఎంపి అవినాష్‌రెడ్డి సిబిఐ విచారణ తొలి రోజు ముగిసింది. బుధవారం దాదాపు 8 గంటల పాటు ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ రావాలని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ఈనెల 25వ తేదీ వరకు ప్రతిరోజు సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 10.15 నిమిషాల సమయంలో అవినాష్‌రెడ్డి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. 10.30 గంటల సమయంలో విచారణ ప్రారంభించిన అధికారులు సాయం త్రం 6.30 గంటల వరకు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకొని వాటిని అవినాష్ రెడ్డికి ఇచ్చి వాటికి సమాధానం చెప్పాలని సూచించారు. ఈ మేరకు అవినాష్ రెడ్డి చెప్పే సమాధానాలను సిబిఐ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. దాదాపు 8 గంటల పాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించా రు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లిన మొదటి మూడు గంటల్లో ఏం జరిగిందని అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అదే విధంగా ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను కూడా సిబిఐ అధికారులు దాదాపు ఐదున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10.40 నిమిషాల సమయంలో ఇద్దరు నిందితులను చంచల్ గూడ జైలు నుంచి సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. 11 గంటల సమయంలో విచారణ ప్రారంభించారు. ఉదయ్ కుమార్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వేర్వేరుగా ఉంచి న్యాయవాదికి కనిపించే విధంగా ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆధారాలు చేరివేయడంతో పాటు… రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా తలకు బ్యాండేజ్ చుట్టిన విషయాన్ని ఉదయ్ కుమార్‌రెడ్డి వద్ద ప్రస్తావించారు. దీనికి అతను చెప్పిన సమాధానాలను సిబిఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నావనే విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 2019 మార్చి 15వ తేదీన తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారనే విషయాలను ఉదయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన వివరాలను వైఎస్ భాస్కర్ రెడ్డివద్ద ప్రస్తావించారు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు ఉదయం 9 గంటలకు రెండో రోజు కస్టడీలో భాగంగా తిరిగి సిబిఐ కార్యాలయానికి తీసుకురానున్నారు
తొలిరోజు 8 గంటలు
RELATED ARTICLES