తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిజెగా అరుణ్ కుమార్ గోస్వామి
దేశవ్యాప్తంగా పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీ : అధికారిక ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. భారీ బదిలీల్లో భాగంగా నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థానచలనం కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్.చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన కొన్ని వారాల్లోపే ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎ.కె.గోస్వామిని బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ రఫీక్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపించారు. డిసెంబర్ 14 నాడు కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జస్టిస్ హిమా కోహ్లి కాకుండా మరో నలుగురు హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి డా.ఎస్.మురళీధరన్‌ను ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీచేశారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిత్తల్‌ను జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియాను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని కొలీజియం ప్రతిపాదించింది. పలువురు న్యాయమూర్తులను కూడా బదిలీ చేశారు. అయిదుగురు న్యాయమూర్తుల కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డేతోపాటు న్యాయమూర్తులు ఎన్.వి.రమణ, ఆర్.ఎఫ్. నారిమన్, యు.యు.లలిత్, ఎ.ఎం.ఖన్విల్కర్ సభ్యులుగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సిజెలు
RELATED ARTICLES