HomeNewsBreaking Newsతెలుగు తేజానికి3వ ర్యాంక్‌

తెలుగు తేజానికి3వ ర్యాంక్‌

సివిల్స్‌లో టాప్‌ త్రీలో నిలిచిన నారాయణపేట జిల్లా ఎస్‌పి వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి
మొదటి ర్యాంకుతో మెరిసిన ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ ఇషితా కిశోర్‌
ప్రజాపక్షం/ న్యూఢిల్లీ/హైదరాబాద్‌
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యుపిఎస్‌సి నిర్వహించిన సివిల్స్‌ 2022 తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఎస్‌పి వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనినవర్సిటీకి చెందిన ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకుతో అదరగొట్టారు. అయితే మొదటి నాలుగు ర్యాంకుల్లోను మహిళలే మెరిశారు. గరిమ లోహియా రెండవ ర్యాంకు, ఉమా హారతి మూడవ ర్యాంకు, స్మృతి మిశ్రా నాల్గొవ ర్యాంకు సాధించారు. లోహియా, మిశ్రాలు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్స్‌ కాగా, హారతి ఎన్‌ ఐఐటి హైదరాబాద్‌లో బి.టెక్‌ డిగ్రీ హోల్డర్‌. ప్రతిష్టాత్మక పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులను మహిళలే సాధించడం వరుసగా ఇది రెండవ ఏడాది. కాగా, 2022 ఏడాదికి గాను మొత్తం 933 మందిని యుపిఎస్‌సి ఎంపిక చేసింది. టాపర్‌గా నిలిచిన 25 అభ్యర్థుల్లో 14 మంది మహిళలు ఉండగా, 11 మంది పురుషులు ఉన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను ఏడాదిలో మూడు దశల్లో నిర్వహిస్తారు. 2022 ఏడాదికి అర్హత సాధించిన అభ్యర్థుల్లో జనరల్‌ కోటాలో 345 మంది, ఇడబ్ల్యుఎస్‌ నుంచి 99, ఒబిసి నుంచి 263, ఎస్‌సి నుంచి 154, ఎస్‌టి విభాగం నుంచి 72 మంది ఉన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా 1,022 పోస్టులను కేంద్రం భర్తీ చేయనుంది. పోస్టుల వారీగా చూస్తే ఐఎఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపిఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. మొత్తం 178 మంది అభ్యర్థులను రిజర్వ్‌ జాబితాలో ఉంచినట్లు యుపిఎస్‌సి తెలిపింది. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ – ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యుపిఎస్‌సి ప్రకటించింది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022ను గత ఏడాది జూన్‌ 5వ తేదీన నిర్వహించారు. మొత్తం 11,35,697 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన రాత పరీక్షకు అర్హత సాధించిన 13,090 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తెలుగు విద్యార్థులు సత్తా…
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు సివిల్స్‌లో సత్తా చాటారు. అలాగే, తిరుపతికి చెందిన జివిఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకుతో మెరిశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అజ్మీరా సంకేత్‌ కుమార్‌ 35వ ర్యాంకు, శాఖమూరి శ్రీసాయి అశ్రిత్‌ 40, సాయి ప్రణవ్‌ 60, ఆవుల సాయికృష్ణ 94, నిధి పాయ్‌ (హైదరాబాద్‌) 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243, అంకుర్‌ కుమార్‌ 257, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనారెడ్డి 346, శృతి యారగట్టి ఎస్‌ 362, సోనియా కటారియా 376, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఇప్పలపల్లి సుష్మిత 384, రేవయ్య 410, సిహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462, రెడ్డి భార్గవ్‌ 772, నాగుల కృపాకర్‌ 866 ర్యాంకులతో సత్తా చాటారు.
సిఎస్‌బి ఐఎఎస్‌ అకాడమీ జయకేతనం
సివిల్స్‌ సర్వీస్‌ ఫలితాల్లో హైదరాబాద్‌లోని సిఎస్‌బి ఐఎఎస్‌ అకాడమీ, ప్రజ్ఞా ఐఎఎస్‌ సంస్థ విజయకేతనం ఎగురవేసింది. ప్రజ్ఞా ఐఎఎస్‌ సంస్థ నేషనల్‌ లెవెల్‌ మొదటి రెండు ర్యాంకులతో పాటు మొత్తం 73 మంది సివిల్స్‌ అర్హత సాధించారు. జాతీయ స్థాయి ర్యాంకులో పదిలోపు ఇద్దరు, వందలోపు 13 మందితో పాటు మరో 58 మంది తమ విద్యార్థులు అర్హత సాధించడం పట్ల తేజ్‌ స్వరూప్‌ హర్షం వ్యక్తం చేశారు. సిఎస్‌ బి ఐఎఎస్‌ అకాడమీకి ఈసారి కూడా ర్యాంకులపంట పండింది. మొత్తం 18 ర్యాంకులను సాధించారు. 22, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించినట్టు సంస్థ డైరెక్టర్‌ బాలలత తెలిపారు. తమ అకాడమీ ద్వారా గత ఏడెనిమిదేళ్ళలో సుమారు 100 మందికి పైగా సివిల్‌ సర్వెంట్లను దేశానికి అందించడం గర్వకారణంగా వుందన్నారు. రాబోయే రోజులలో మరింతమంది సివిల్‌ సర్వెంట్లను అందులో ముఖ్యంగా పెద్దసంఖ్యలో తెలుగువారిని దేశానికి అందించడమే లక్షంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. తమ లక్ష్యసాధనలో సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments