త్వరలోనే దేశం ఆశ్చర్యపోయేలా గొప్ప పథకం
కొండ పోచమ్మసాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టీకరణ
ఉచితంగా రైతులకు కాళేశ్వరం నీరు
ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తీరువా వసూలు చేయబోం
ప్రజాపక్షం/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి/ సిద్దిపేట అర్బన్: కొండ పోచమ్మసాగర్ రాష్ట్ర చరిత్రలోనే ఒక ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ వద్ద 15 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన జలాశయాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రైతాంగానికి తీపి కబురు చెబుతానన్నారు. తాను ఇప్పుడే బయటపెట్టనని కానీ, దేశం ఆశ్చర్యపడేలా పథకం ఉంటుందని స్పష్టం చేశారు. ఏ లక్ష్యాన్ని ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశామో… ఆ కల ఇప్పుడు సంపూర్ణంగా సాకారమైందన్నారు. కొండ పోచమ్మసాగర్ అద్భుతమైన ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం భూములిచ్చిన వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. భూములు కోల్పోయిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. కొండ పోచమ్మసాగర్‌తో ఉమ్మడి మెదక్ జిల్లా సస్యశ్యామలమవుతుందని, 618 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ ద్వారా ఎత్తిపోయడం గొప్ప విషయమన్నారు. గజ్వేల్ పట్టణానికి ప్రతి రూపంగా 600 ఎకరాల్లో న్యూ గజ్వేల్ టౌన్ రూపుదిద్దుకుంటుందన్నారు. కొండ పోచమ్మసాగర్ నిర్వాసితులకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని వ్యాఖ్యానించారు. 530 టిఎంసిల నీటిని ఉపయోగించుకునేలా ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుందన్నారు. ఇంత త్వరగా ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. త్వరలోనే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా మారనుందన్నారు. నయా పైసా లేకుండా ఉచితంగా విద్యుత్తును అందిస్తున్న తరహాలోనే కాళేశ్వరం నీళ్లను కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తీరువా వసూలు చేయబోమన్నారు. దేశంలో 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే, అందులో 53లక్షల టన్నుల ధాన్యం తెలంగాణలో పండిందన్నారు. ఆరేళ్ల కింద అనాథ తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజినీర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎంఎల్‌సిలు ఫారూఖ్‌హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మడుపు భూంరెడ్డి, భూపతిరెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చండీహోమంలో పాల్గొన్న సిఎం
కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమంలో సిఎం కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించగా, కెసిఆర్ ఆయన సతీమణి శోభ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. అమ్మవారి ఆశిస్సులు తీసుకున్నారు.