మంత్రిమండలి నుంచి ఒక మంత్రి బర్తరఫ్
కొద్దిగంటల్లోనే ఉత్తర్వు ఉపసంహరించుకున్న రాజ్‌భవన్
దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ
అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బిజెపి అనుసరించే వ్యూహాల్లో భాగమే
(ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీ)
తెలంగాణ, పశ్చిమబెంగాల్ గవర్నర్లు కూడా తమిళనాడు గవర్నర్ ఆర్‌యన్ రవి బాట పట్టనున్నారా? ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాదని ఏకంగా ఒక మంత్రిని తమిళనాడు మంత్రిమండలి నుండి గురువారం బర్తరఫ్ చేసి, తిరిగి కొద్ది గంటలలోనే ఉత్తర్వును రాజ్‌భవన్ ఉపసంహరించుకున్న ఘటన దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. రాజ్యాంగంలో, ఇతర విధాలా తనకున్న ఏ హక్కును ఉదహరించకుండా గవర్నర్ జారీచేసిన రాజ్యాంగ ఉల్లంఘన ఉత్తర్వు ఆషామాషిగా వెలువడింది కాదు. రానున్న లోక్‌సభ, మరికొన్ని రాష్ట్రాలలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందన్నది వాస్తవం. దక్షణాది రాష్ట్రాలలో
చట్టసభలలోని సభ్యుల సంఖ్య రీత్యా పెద్దదైన తమిళనాడు, బిజెపికి “తీవ్ర యుద్ధభూమి”గా మారింది. అందులో అది విడిచిన మొదటి బాణం ఇది. మంత్రి సంతిల్ బాలాజిపై హవాలాకేసును కేంద్ర సంస్థ ఇ.డి. పెట్టింది. ఈ కేసును ఎదుర్కొంటున్నందున బర్తరఫ్ ఉత్తర్వు జారీచేసినట్లు గవర్నర్ సమర్థనకు పూనుకున్నారు. రానున్న రోజుల్లో ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వంపై బిజెపి మరింత వత్తిడి పెంచుతుందనడాన్ని ఈ బర్తరఫ్ గుర్తుచేస్తుంది. అందుకు ప్రస్తుత చట్టపరమైన / రాజ్యాంగపరమైన పద్ధతులన్నింటిని బిజెపి వినియోగిస్తుంది. అయితే, గవర్నర్ రవి మాత్రం ఎన్నికైన ప్రజాప్రభుత్వ విధానాలకు రాజ్యాంగానికి, చట్టాలకు తాను కట్టుబడి వుండనని బాహాటంగానే వెల్లడించారు. ఇవన్నీ దక్షిణాది బిజెపి ఎన్నికల వ్యూహకర్తల గ్రూపు ఎత్తుగడలలో భాగమే! గవర్నర్ రవి అడుగుజాడల్లోనే రాజకీయంగా సున్నితంగా వున్న తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కూడా బిజెపి ఆదేశాలను స్వీకరించే గవర్నర్లు, ఎన్నికల వ్యూహకర్తల ఎత్తుగడలను అనుసరించక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్, బిఆర్‌ఎస్‌ని అణచడానికి లేదా తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి ఇడి, సిబిఐ, ఆదాయపు పన్నుశాఖలన్నింటిని బిజెపి వినియోగిస్తుంది. అవసరమైతే, అలాంటి పద్ధతినే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపిపై వినియోగించవచ్చు. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి వీసమెత్తు కూడా రాజకీయంగా ఎదగలేకపోయిందన్న భావన కేంద్ర నాయకత్వంలో ప్రగాఢంగా గూడుకట్టుకుంది. గత ఎన్నికల్లో 173 స్థానాలలో పోటీచేసి ఒక్క సీటు కూడా గెలువలేకపోగా అంతటా డిపాజిట్లు కోల్పోయింది. మొత్తంలో 0.84 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ పూర్వరంగంలోనే, బుధవారం రాత్రి ప్రధాని మోడీ నివాసంలో హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జె.పి. నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, ఇతర సీనియర్ నాయకులు 2024 లోక్‌సభ ఎన్నికలు, కొద్ది మాసాలలో ఐదు రాష్ట్రాలలో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఐదు గంటల సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మంత్రిమండలి చేర్పులు మార్పులపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయి కేంద్రీకరణకు ప్రత్యేక దృష్టితో దేశాన్ని తూర్పు, ఉత్తరం, దక్షిణంగా మూడు భాగాలుగా విభజించారు. తూర్పు భాగంలో ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా సమావేశం గౌహతిలో జులై 6న, ఉత్తర భాగంలో ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, ఎంపి, యుపి, ఉత్తరాఖండ్, హర్యాన, గుజరాత్, చండీఘర్ సమావేశం జులై 7న ఢిల్లీలో, దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకల రాష్ట్రాల సమావేశం హైదరాబాద్‌లో జులై 8న నిర్వహించడానికి బిజెపి అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికల ఎత్తుగడల్లో అనుసరించాల్సిన విధానాలను, యూనిఫాం సివిల్‌కోడ్ ప్రచారంపై కేంద్రీకరించనున్నట్లు వెల్లడైంది.