HomeNewsLatest Newsతెలంగాణ తల్లి విగ్రహం

తెలంగాణ తల్లి విగ్రహం

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం 

పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరం
బిఆరెస్‌ నేతలకు అధికారం పోయినా గర్వం తగ్గలేదు
దేశ యువతకు స్ఫూర్తి ప్రధాత రాజీవ్‌ గాంధీ
జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సెక్రటేరియట్‌ ఆవరణను పరిశీలించిన సిఎం, డిప్యూటీ సిఎం

ప్రజాపక్షం / హైదరాబాద్‌
డిసెంబర్‌ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించనవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం బిఆర్‌ఎస్‌ నేతలను సామాజిక బహిష్కరణ చేస్తుందని ఆయన అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పూలమాలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఎఐసిసి తెలంగాణ ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ తూర్పు జయప్రకాష్‌రెడ్డి, (జగ్గారెడ్డి),మహేష్‌కుమార్‌ గౌడ్‌, ఎంపిలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్‌, శ్రీగణేష్‌ పలువురు కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ “సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానంలేదు. బిఆరెస్‌ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. “సెక్రటేరియట్‌ ముందు కెటిఆర్‌ అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు. అధికారంలోకి వస్తే రాజీవ్‌ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి. నీ అయ్యవిగ్రహం కోసం రాజీవ్‌ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?. అధికారంలోకి వస్తే అని కెటిఆర్‌ మాట్లాడుతున్నాడు. బిడ్డా& మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చినతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు” అని ముఖ్యమంత్రి అన్నారు.
దేశ యువతకు స్ఫూర్తి ప్రధాత రాజీవ్‌ గాంధీ
దేశ యువతకు స్ఫూర్తి ప్రధాత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కొద్ధి రోజుల్లో సచివాలయం ఎదురుగా పండుగ వాతావరణంలో రాజీవ్‌ గాంధీ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. 1980 దశకంలోనే దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని ఆయన కొనియాడారు. మహాత్మాగాంధీ స్పూర్తితో రాజీవ్‌గాంధీ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేశారని, మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. సచివాలయం ఎదురుగా రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దేశం కోసం అమరుడైన రాజీవ్‌ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సౌత్‌ కొరియాలో ఒక యూనివర్సిటీలో 16 మందికి ఒలింపిక్స్‌ పతకాలు వచ్చాయని, అందుకే తెలంగాణలో యంగ్‌ ఇండియా స్పోర్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, ఒలింపిక్స్‌ లక్ష్యంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని సిఎం అన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్స్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు.
సెక్రటేరియట్‌ ఆవరణను పరిశీలించిన సిఎం, డిప్యూటీ సిఎం
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్‌ ఆవరణను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క పరిశీలించారు. డిసెంబర్‌ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి అందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార కేంద్రమైన సెక్రటేరియట్‌ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్టిస్తామని ఈ సందర్భంగా సిఎం పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్‌ ప్రణాళికలపై అధికారులతో సిఎం, డిప్యూటీ సిఎం చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సిఎం సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments