HomeNewsTelanganaతెలంగాణ తలమానికం సింగరేణి

తెలంగాణ తలమానికం సింగరేణి

80 శాతం ఉద్యోగాలు స్థానికులకే
సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మల్లు భట్టివిక్రమార్క
సింగరేణిని విస్తరించండి : కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ ఖమ్మం

తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి లాభాలను కార్మికులకే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఆదివారం కొత్తగూడెం రామవరంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణలోను లాభాలను తీసుకురావడంలోను కార్మికుల పాత్ర వెలకట్ట లేనిదన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా సింగరేణి కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని దీనిపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి సారించనుందని విక్రమార్క తెలిపారు. సంక్షేమ రాజ్యంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు జీవన పరిస్థితులు మెరుగవడానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిబిడ్డకు ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటుందన్నారు. సింగరేణిలో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా జరుగుతున్న శ్రమ దోపిడీని ఉపేక్షించబోమని గత ప్రభుత్వం కనీస వేతనాలపై ఎటువంటి సమీక్ష చేయకపోవడం వల్ల
నష్టపోయారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష నేతగా పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సింగరేణి సంస్థలో రెగ్యులర్‌ వాచ్‌మెన్‌ రూ. 46వేలు వేతనం పొందుతుంటే ఏజెన్సీలో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ కార్మికుడు కేవలం రూ.11,500 మాత్రమే వేతనం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్క్యూలర్‌ జారీ చేసిందన్నారు. 10 రోజుల్లోనే 441 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మరో 464 ఉద్యోగాలు నోటీఫికేషన్‌ జారీ చేశామని డిపెండెంట్‌ ఉద్యోగాలకు సంబంధించి వయస్సును 35 నుంచి 40కు పెంచామన్నారు. రాబోయే కాలంలో 90 నుంచి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేశామని నైనిటాల్‌, తాడిచర్ల, కోయగూడెం, రాంపురం బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం కానివ్వబోమని భట్టి భరోసా ఇచ్చారు. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న అన్ని ప్రదేశాల్లో సోలాల్‌ పవర్‌ విద్యుత్‌ ఉత్పత్తికి కృషి చేస్తున్నామన్నారు. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల వద్ద కూడా జల విద్యుత్‌, సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు రచించామని త్వరలో అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా కొనుగోలు చేసి రాష్ట్రాన్ని నష్టపరిచిందన్నారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న 43వేల మందికి కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామని భట్టి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న సిపిఐ నేత, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా కోల్‌బెల్ట్‌ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. సింగరేణి మనుగడ కోల్‌బెల్ట్‌ ప్రాంతాల అభివృద్ధి, ప్రతిపాదనలో ఉన్న నూతన భూగర్భ బొగ్గు బావులను ఏర్పాటు చేయాలని సాంబశివరావు కోరారు. ఈ సందర్భంగా మల్లు భట్టివిక్రమార్కకు కూనంనేని సింగరేణి అభివృద్ధితో పాటు కార్మిక సంక్షేమం, ఆరోగ్యం తదితర విషయాలకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. ఏజెన్సీ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు సింగరేణి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాల్వంచ పవర్‌ ప్లాంట్‌ను విస్తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సింగరేణి సిఎండి బలరాం నాయక్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments