మూడు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి
సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ వెల్లడి
గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ప్రజాప్రతినిధుల భవితవ్యం
తెలంగాణ ప్రభుత్వం విమర్శ
న్యూఢిల్లీ: ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ విధమైన బిల్లులూ తమ వద్ద ప్రస్తుతం అపరిష్కృతంగా లేవని, మూడు బిల్లులు క్రియాశీల పరిశీలనలో ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. తెలంగాణ పంచాయతీ బిల్లు సవరణ బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ కొన్ని వివరణలు కోరారని కూడా మెహతా ప్రకటన పేర్కొంది. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెరినేషన్ రెగ్యులేషన్) సవరణ బిల్లు 2022ను న్యాయశాఖ ఇంకా గవర్నర్ పరిశీలన, సమ్మతి నిమిత్తం ఇప్పటివరకూ పంపలేదని కూడా మెహతా కోర్టుకు చెప్పారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం సోమవారం తన వాదనలు వినిపించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు ఆలకించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది దవేకు మధ్య వాగ్వాదం రేగింది. బిల్లులను సంతకాలు చేసి పంపారని, కొన్ని బిల్లులను ప్రభుత్వ పరిశీలన నిమిత్తం గవర్నర్ వెనక్కితిప్పి పంపారని ధర్మాసనానికి తుషార్ మెహతా తెలియజేశారు. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లు తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2023లకు గవర్నర్ ఆమోదం తెలియజేశారని తెలంగాణ గవర్నర్ కార్యాలయ కార్యదర్శి తమకు సమాచారం పంపారని తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) సవరణ బిల్లు 2022, తెలగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు నియంత్రణ సవరణ బిల్లు ప్రస్తుతం గవర్నర్ టేబుల్‌పై క్రియాశీల పరిశీలనలో ఉన్నాయని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలియజేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను వెంటనే సంతకాలుచేసి పరిష్కరించి తమకుతిప్పి పంపేవిధంగాగవర్నర్‌కు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణలో పది బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి చెప్పారు. ఈ విధమైన ఘటనలన్నీ గవర్నర్ కార్యాలయాల ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోనే జరుగుతున్నాయని ఆయన ధర్మాసనానకి తెలియజేశారు. బిజెపి పాలిత గుజరాత్‌లో గవర్నర్ ఏడు రోజుల్లో బిల్లులను ఆమోదించి పంపుతున్నారని, మధ్యప్రదేశ్‌లోని బిజెపి పాలిత రాష్ట్రంలో కూడా నెలరోజుల్లోపే బిల్లులను ఆమోదించి పంపుతున్నారని దవే కోర్టు దృష్టికి తెచ్చారు. రాజ్యాంగంలోని 200 అధికరణను దవే ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో ఈ అధికరణ తగిన మార్గదర్శకాలు నిర్దేశించింది. శాసనమండలి కూడా ఆ రాష్ట్రానికి ఉన్నట్లయితే ఉభయసభలూ కూడా గవర్నర్‌కు తాము ఆమోదించిన బిల్లులను పంపవలసి ఉంటుంది. గవర్నర్ వాటిని ఆమోదిస్తారు, కొన్ని సందర్భాలలో బిల్లును రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం రిజర్వు చేసి ఉంచుతారు. అయితే ప్రస్తుతం తమ కార్యాలయం వద్ద ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేదని తెలంగాణ గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ద్వారా ధర్మాసనానికి ఈ సమాచారం అభించింది. వాస్తవాలను పరిశీలించడానికి తాము ఈ విషయంలో ఉన్న మంచి చెడుల జోలికి వెళ్ళదలచుకోలేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగం 200 అధికరణలోన మొదటి నిబంధనను ఈ సందర్భంగా దుశ్యంత్ దవే ప్రస్తావిస్తూ, “గవర్నర్‌కు బిల్లు ఇవ్వగానే ఆమోదించాలని, లేకపోతే తిప్పిపంపాలని, అప్పుడు సభ తిరిగి పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్, “ధర్మాసనానికి మీరు ఈ నిబంధనలను చదివి వినిపించాల్సిన అవసరం లేదు అని చెప్పగానే సొలిసిటర్ జనరల్‌కూ, దవేకు మధ్య వాగ్వాదం చెలరేగింది. దాంతో ఈ అంశాన్ని ధర్మాసనం పరిష్కరించగలదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. “బిల్లులను వీలైనంత త్వరగా ఆమోదించి పంపాలి” అనే రాజ్యాంగ అధికరణలోని నిబంధన బహుశా తప్పనిసరిగా రాజ్యాంగ నిర్మాతల మనసులోంచే పుట్టిన అంశమై ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అదంత ముఖ్యమైనదేం కాదని మెహతా పేర్కొనగా ఈ కేసులో ఇంతవరకూ తాము ఏ విషయం చెప్పలేదని ధర్మాసనం గుర్తుచేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తన అభిప్రాయం ఏమిటో చెప్పాలని మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
తెలంగాణ గవర్నర్ వద్దబిల్లులు పెండింగ్‌లో లేవ్
RELATED ARTICLES