HomeNewsBreaking Newsతెలంగాణ అసెంబ్లీ విజ్ఞప్తి పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు

తెలంగాణ అసెంబ్లీ విజ్ఞప్తి పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ మంగళవారం నాడు ఏక్రగీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానాన్ని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.టి.రామారావు ప్రవేశపెట్టారు. దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి, సమానత్వమే అసలైన ప్రజాస్వామ్యమన్న వ్యక్తి, స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరిన వ్యక్తి అంబేడ్కర్‌ అని ఆయన అన్నారు. టెంపుల్‌ ఆఫ్‌ డెమోక్రసీ అయిన పార్లమెంట్‌కు పేరు పెట్టడానికి ఆయన పేరుకంటే మించినది ఏదీ లేదని చెప్పారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ర్టం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్‌ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్‌ నడుస్తోందని , సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం సాధించాలని అంబేడ్కర్‌ చెప్పారని తెలిపారు. అవి లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని ఆయన అభిప్రాయపడినట్లు వెల్లడించారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్‌ అని
పేర్కొన్నారు.
బిజెపికి ఇష్టం లేనట్లుంది
పార్లమెంటుకు అంబేడ్కర్‌ పేరు పెట్టడం బిజెపికి ఇష్టం లేనట్లున్నదని, శాసనసభలో ఉన్న ఒక్క బిజెపి సభ్యుడు కూడా తీర్మానంపై చర్చ సమయంలో బైటికి వెళ్ళిపోయారని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టండిః భట్టి
తీర్మానానికి మద్దతుగా సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం దేశ ప్రజలకు దూరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రశ్నించిన వారిపై సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని, పాలకులు దేశ సంపదను కొన్ని వర్గాలకు మాత్రమే పంచుతున్నారని, దీంతో సమానత్వం కూడ లేకుండా పోతుందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అలజడులు రేపి శాంతిని కలుషితం చేసే ప్రయత్నం చేస్తూ సోదరభావం లేకుండా కొంత మంది చేస్తున్నారని అన్నారు. ఇలాంటి క్రమంలో అంబేడ్కర్‌ పేరును పార్లమెంటుకు పెట్టడం వల్ల ఆయన స్ఫూర్తితో నైనా కొంత మార్పు రావడానికి అవకాశం ఉందన్నారు.పార్లమెంట్‌ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేసిన సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసి గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి కెటిఆర్‌ స్పందిస్తూ రహదారులపై విగ్రహాలు ఏర్పాటుకు అనుమతిపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని, దాని ప్రకారం ఏమీ చేయలేమని చెప్పారు. పంజాగుట్ట చౌరస్తాకు కూత వేటు దూరంలోనే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని జనవరి మాసంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుందని తెలిపారు. ఎంఐఎం సభ్యులు అహ్మద్‌ బల్లాలా మాట్లాడుతూ పార్లమెంటు భవనానికి పేరు పెట్టేందుకు అంబేడ్కర్‌కు మించిన వారు లేరని అన్నారు.
విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు 2022ను ఉపసంహరించాలని తీర్మానం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర శాసనసభ రెండవ సారి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడుతూ విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు 2022ను శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని , దేశ ప్రగతి, రైతుల ప్రయోజనాలకు,సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments