HomeNewsTelanganaతెలంగాణ అభివృద్ధికి ‘మెగా మాస్టర్‌ప్లాన్‌'

తెలంగాణ అభివృద్ధికి ‘మెగా మాస్టర్‌ప్లాన్‌’

‘2050 విజన్‌ దిశ’గా ముందుకెళ్తున్నాం
గత 30 ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా కొనసాగిన హైదరాబాద్‌ నగరాభివృద్ధి
మహానగరాన్ని అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ అర్బన్‌ మూడు భాగాలుగా చేసి అభివృద్ధి చేస్తాం
అగ్నిమాపక సంస్థ ప్రధాన కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ‘మెగా మాస్టర్‌ ప్లాన్‌’ను తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘2050 విజన్‌ దిశ’గా ముందుకెళ్తున్నామన్నారు. గతంలో సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ, భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందిస్తూ ముందకెళ్తామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌ ప్రపంచంతో పోటీ పడుతోందని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. గత 30 ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, నగర అభివృద్ధి కొనసాగిందని రేవంత్‌ రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సంస్థ ప్రధాన కార్యాలయ భవనాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాల నివారణ కోసమే కాదని, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరి సేవలు అమూల్యమని కొనియాడారు. అగ్నిప్రమాదాల్లో ప్రాణాలకు తెగించి, ప్రజల ప్రాణాలు కాపాడే అగ్నిమాపక సిబ్బంది సేవలు మరవలేనివన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్నిమాపక శాఖకు భవనం లేకపోవడం సరికాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రత లు ఉంటాయో, అక్కడ అభివృద్ధి చెందుతుందని, నగరంలో శాంతిభద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, హైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని చెప్పారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ అర్బన్‌ మూడు భాగాలుగా అభివృద్ధిని చేస్తామన్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో 25వేల ఎకరాల్లో హెల్త్‌, స్పోర్ట్‌ కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు
చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైలు రద్దు కాలేదని, ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కాదని, ఫార్మావిలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి అపోహలు వద్దని, తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నదన్నారు. తమకు తామే మేధావులుగా భావించబోమని, అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తామని, ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవడం తమ ప్రభుత్వ విధానమన్నారు. ఫార్మాసిటీని కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఫార్మా పరిశ్రమల ఏర్పాటు సరికాదని, ఒకే చోట కాకుండా పది నుండి పదిగేను ప్రాంతాల్లో ఫార్మా విలేజులను ఏర్పాటు చేస్తామన్నారు. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే, మేడిగడ్డ తరహా అవుతుందని సిఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments