అనంతపురం జిల్లాలో 390 చదరపు కిలోమీటర్ల మేర బంగారు ఖనిజాలు
దేశంలో 4,20,000 చదరపు కి.మీ. మేర గల కొండచరియలు విరిగి పడే ప్రమాదం
దక్షిణ భారతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యకలాపాల నివేదిక సమర్పణ
విలేకరుల సమావేశంలో వెల్లడించిన జిఎస్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇనుప ఖనిజ వనరులు విస్తారంగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ ఐ) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలోని ఎర్రబలి, ఆర్నాకొండ, చండోలి, అంబరిపేట బ్లాక్స్, ఆదిలాబాద్ జిల్లాలోని రెబ్బనపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గురిమల్ల, డబ్రిపేట్, అబ్బాపూర్, మల్లంపల్లి వరకు 89.22 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం వనరులు విస్తరించి ఉన్నట్లు ఆయన వివరించారు. సున్నపురాయి, బంగారం నిల్వల అన్వేషణ, వేలానికి సంబంధించిన నివేదికలను అందజేసినట్లు శ్రీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడుట్ల, చింతాయపల్లి (కర్నూలు జిల్లా) కర్నాటకలోని హోస్కోటి, బెల్గాం జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు, కర్ణాటకలోని అజ్జనహల్లిలో బంగారం నిల్వలున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందజేసినట్లు శ్రీధర్ తెలిపారు. కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలియజేశారు. అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ ఫీల్డ్‌లో డామండిఫెరస్ కిమ్బెర్లైట్ పైప్‌ను కనుగొన్నట్లు ఆయన తెలిపారు.కర్ణాటకలోని తుంకూర్ జిల్లాలో మాంగనీస్‌పై జిఎస్‌ఐ దర్యాప్తు జరిపిందని,3 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ధాతువును కనుగొన్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో 390 చదరపు కిలోమీటర్ల విసీ ర్ణం గల ప్రాంతం బంగారు ఖనిజాల అన్వేషనకు అణువుగా ఉన్నట్లు శ్రీధర్ వివరించారు. విశాఖపట్నం, విజయవాడ, పుదుచ్చేరి, త్రిచూర్, కొచీ, ఎర్నాకు ళం, మంగళూరులో సీస్మిక్ విపత్తులకు సంబధించిన సూక్ష్మఅధ్యయనం జిఎస్‌ఐ ద్వారా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. పట్టణ సమైక్యతలలో విభిన్నమైన భూకంప ప్రదేశ ప్రతిస్పందన యొక్క మైక్రో మండలాలు విస్తరించి ఉన్నాయని ఆయన అన్నారు. దేశంలో 4,20,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం గల ప్రాంతంలో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని, ఇందులో 64751 చదరపు కిలోమీటర్ల భూభాగం దక్షిణ భారతదేశంలో ఉందన్నారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమంగళూరు జిల్లాల్లో ల్యాండ్‌స్లుడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్ జరిగిందని, బిల్గేరి స్లైడ్, నేరియా లాండ్లైడ్, కడ్వాడ్ కొండచరియలు, సాస్న్వాడ్ కొండచరియలు వివరాలపై వివరణాత్మక అధ్యయనం జరిగిందన్నారు. తమిళనాడులోని తేనీ, కోయంబత్తూర్, నీలగిరి, దిండిగుల్, పాలఘాట్, త్రిచూర్, మధురై, తిరునల్వేలి, విరుదునగర్, కన్యాకుమారి జిల్లాల్లో ల్యాండ్‌స్లుడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్ జరిగిందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో కనిపించే మాగ్నెటైట్ రకానికి చెందిన ఇనుప ఖనిజం ద్వారా ఉక్కు కర్మాగారం ప్రతిపాదించనట్లు శ్రీధర్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇటీవల గుర్తించని మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో జిఎస్‌ఐ పరిశోధన నిర్వహించనుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి (కేరళ), కేరళ సహా ఆరు రాష్ట్రాలలో జిఎస్‌ఎస్ దక్షిణ ప్రాంతంలో జియో శాస్త్రీయ కార్యకలాపాలు పూర్తిగా విస్తరించాయని ఆయన వివరించారు.