హైదరాబాద్: తెలంగాణలో మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను రాలేదని మరోమారు ఉద్ఘాటించారు. శనివారం ఆయన మణికొండలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కెసిఆర్ తన పాలనలో ఘనంగా చెప్పుకునే పని ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. తన కృషి వల్లే హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదిగిందన్నారు. ప్రపంచమంతా తిరిగి తాను హైదరాబాద్‌కు పెట్టుబడులు తీసుకొచ్చానని, కెసిఆర్ ఎక్కడికైనా వెళ్లి పెట్టుబడి పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తనైనా అడిగారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రెండుసార్లు ప్రధాని పదవిని వదులుకున్నానని చెప్పారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడలేదని, తెలంగాణలో తన హయాంలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించానన్నారు. తాను హైదరాబాద్ వస్తే ఇక్కడేం పని అంటున్నారని, అసలు టిడిపి లేకపోతే కెసిఆర్ ఎక్కడ ఉండేవాళ్లో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ను తాను కట్టించానని ఎక్కడా చెప్పలేదని, కులీకుతుబ్‌షా దాన్ని కట్టారన్నారు. సైబరాబాద్‌ను తానే కట్టానని స్పష్టంచేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే అచ్చేదిన్ నాలుగున్నరేళ్లలో రాలేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్పకుండా అచ్చేదిన్ వస్తుందని చెప్పారు.
తెలంగాణలో మంచి ప్రభుత్వం రావాలి
RELATED ARTICLES